17, నవంబర్ 2015, మంగళవారం

రాత్రి




సరిత భూపతి

రాత్రి వెన్నెలల నవ్వుల్లోకి చూస్తూ మౌనంగా చీకటితోపాటు కరిగిపోతూ నేను.. నిశిరాకాసి నిశ్శబ్ధంలో చేస్తున్న భయంకర శబ్ధాన్ని పట్టనట్టు కర్టెన్ సందుల్లోంచి వచ్చే గాలిని జోలపాటగా ఆస్వాదించి నిదరోతూ నువ్వు.. ఆ రాత్రంటే నీకు కళ్ళు మూసి తెరచేంతలో జరిగిన ఒక ఆరేడు గంటల సుషుప్తావస్థేనేమో.. కానీ నాకు కన్నీటిని కావ్యాలుగా ఒంపుకున్న మౌనాల్లో నిండిన అనిర్వచిత క్షణాలు.. ఆ రాత్రంటే ఎప్పటికీ తడి ఆరని గాథలను గుండె దండంపై విఫలయత్నంగా ఆరేస్తూ పొద్దునకల్లా పచ్చివాసనేసే భావాలను కళ్ళల్లోనే కుక్కుకొని మరిన్ని కొత్త ఆశలను,దిగుళ్ళనూ నింపుకుంటూ మరో రాత్రి కోసం సిద్ధపడే ఓ అలుపెరుగని పిచ్చి మనసు 20/9/15

B U


// ఆ క్షణం //

// ఆ క్షణం // కొన్నిరాత్రుల్లో ఆకాశం వెన్నెలంతా జారవిడుచుకున్నట్టు మన కళ్ళల్లో మెరుస్తూ ఉంటుంది ఇద్దరి నడుమ నిశ్శబ్ధమే మరో కొత్తరాగంలా పెదవుల చివరన కనీ కనిపించని చిరునవ్వే శృతి కలుపుతూ నిశీధికి కొత్త సుస్వరాలు నేర్పుతుంటుంది మౌనాన్ని ఛేదిస్తూ వచ్చిన నీ తొలి పలకరింపు సాగరఘోషలన్నింటినీ ఒక్క క్షణం నిలిపివేసినట్టుగా నా కళ్ళల్లో భావాలై ఉప్పొంగుతున్నట్టుగా ఉంటాయి ఆ మౌనభాషను నీ మనసు గుర్తించినట్టుగా ఫక్కున నీ మోముపై నవ్వు కలలై కావ్యాలై మౌనమే మధురగీతమైన ఆ క్షణం వెన్నెల నిశితో మెుత్తుకుందేమో ఇలాగే ఉండిపోవా అని 16/10/15

// గుప్పెడు మనసు //



// గుప్పెడు మనసు // చినుకు రాలితే చిగురించిన ఆకుల్లా మనసు తడికి హృదయమెుకటి కొత్తగా మెులుస్తుంటుంది ఆవేదనొచ్చినపుడల్లా అత్తిపత్తిలా ముడుచుకుపోతుంటుంది మౌనంతోనే అనుక్షణం సంగమిస్తూ నిరంతరం తలపులతో పురుడు పోసుకుంటూనే ఉంటుంది పేరుకు గుప్పెడు మాంసపు ముద్దైనా అంతులేని కలలు .. కల్లలైన ఆ కలల కోసం కళ్ళలో జలపాతాలు .. కొన్నిసార్లు ఎగిసి ఎగిసిపడుతున్న ఆశల కెరటాలను మోస్తూ తీరం చేరని అలల ఆశయాల కోసం ఆ గుప్పెడే సాగరమంతవుతుంటుంది కొన్ని ఆటుపోట్లు కుదించివేస్తుంటే కొన్ని మౌనాలు కలిచివేస్తుంటే నాకు నేనే అంతుపట్టనంత శూన్యమవుతుంటుంది 20/10/15

// ఏ యుగం చూసినా ఏమున్నది గర్వకారణం//

// ఏ యుగం చూసినా ఏమున్నది గర్వకారణం// యా దేవీ సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత లోకమాతా! లవకుశులంటి వీర కొమరులెవరూ లేరిక్కడ క్షమించాలి వీరత్వం లేకపోవటమేమిటీ కామంతో కళ్ళు బయర్లు కమ్మి, నీ మాతృరూపాన్ని కూడా గుర్తించని మెుగతనమంతా వీరత్వమేగా యా దేవీ సర్వభూతేశు శాంతిరూపేణ సంస్థిత ఎంత ఎమోషనల్ బ్లాక్ మెయిలింగో నిన్ను పొగిడినపుడే గుర్తించాల్సింది రాఘవప్రియా! ఆ ప్రియత్వం అంతా చేయని అపరాధాన్ని మోస్తూ అగ్నికి నిన్ను నువ్వు అర్పించుకొని పునీత అని నాలుగు నోళ్ళలో నానితేనే బయటపడుతుందనీ, కర్కశత్వానికి భయపడి తల్లి ఒడిన దాగోకపోతే ఇంకెన్నాళ్ళో కదూ రామవల్లభా అని పిలుస్తూ నిరంతరం వధిస్తూ విష్ణుపత్నీ! మరి సిరికిన్ చెప్పడే? సిడి ముడి తడబడినా, జారే పవిట ఆపటానికి అష్టకష్టాలు పడటం ముల్లోకాలు చూస్తున్నా, అది నీ పరువు తీయటం కాదనీ గజేంద్రమోక్షం అంటే లోకం చంకలు గుద్దుకొని ఆలకిస్తుందనీ ద్రుపదరాధ్యా.. ధర్మరాజప్రియాయై.. అర్జునవిమోహనాయై.. భీమసేనమనూవల్లభాయై.. సవ్యశాచిశివశాయై .. నకులస్వాంతభూషణాయై వారి నామధేయములను ముందు తగిలించుకున్నా ఆ అయిదుగురు భర్తల ముందు విధవ అవుతుంటే గుడ్లప్పగించి చూసారే?యజ్ఞసంభూతా! పేరుకు తగిలించిన నీ పురుషపుంగవుల పేర్లు ఆనాడే నిన్ను నగ్నంగా చూస్తూ వెక్కిరించాయి కదా స్త్రీ శక్తిస్వరూపిణి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఈ పొగడ్తలన్నీ నిన్ను తుంగలో తొక్కటానికే యుగాలు మారినా ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీ అంటే కార్యేషు దాసీ శయనేషు రంభ 23 oct 15

//ఆశ//

//ఆశ// పున్నాగ పూల పరిమళంలా ఎదురవుతావు తెలిమంచులా నిన్ను అతుక్కుపోతాను తొలిసంధ్యతో వికసిద్దామని ఎదురుచూస్తూ నువ్వు అవే ఆఖరి క్షణాలని కృంగిపోతూ నేను దిగులు కొయ్యపై ఆరని పచ్చి భావాలుగా నేను ఆత్మీయత ఒక దిక్కు ఆవేశం ఒక దిక్కు మండిస్తూ మనసుకొయ్యను సైతం దహించివేసే ఉత్ర్పేరకం నువ్వు దూరపు కొండల్లా దగ్గరే ఉన్నట్టుండే దూరాలమో దగ్గరే ఉన్నా దూరమవుతున్న రెండు విరహాలమో కానీ ఇద్దరి గమ్యం ఒక్కటే రేపు పొడిచే తొలిపొద్దు కోసం మళ్ళీ వికసించే నవ్వుల కోసం ప్రతీ దినం అదే ఆశ ఇది చాలేమో జీవించటానికి 26/10/15 సరిత భూపతి
                                   

// చందమామ రావే //



// చందమామ రావే // ఏం చెప్పను? ఏమీలేదు అనటం వెనక ఎంతుందో అంతుంది నీ గురించి చెప్పటానికి అమ్మ అబద్ధం కూడా ఎంత తీయగా ఉంటుందో గోరుముద్దల లాలిత్యానికి మురుస్తున్నపుడు నాపై జెలసీతో ఆ అబద్ధం నిజం చేద్దామన్నట్టుగా అమ్మ కళ్ళలో మెరిసిన నీ వెన్నెలను చూడటం ఆనాడు ఒక అద్భుతమే నాకు. కొండెక్కి రావే గోగుపూలు తేవే పాటల్లో నిజంగానే కొండలన్నీ ఎక్కినట్టు వచ్చే మిత్రుని కోసం చూస్తూ గోగుపూలంటి నక్షత్రాల్లో పరవశిస్తూ మేఘాల్లో దాగుడుమూతలాడుతుంటే నీతోపాటు పరిగెత్తటం ఎంత అందమైన జ్ఞాపకమో. అమావాస్య తరువాత నువ్వు కనిపించినపుడు "అన్నం తినకపోతే నిన్ను బూచాడు పట్టుకెళ్ళాడు చూసావా?" అని నీతో మాట్లాడిన ఆ అమాయకత్వపు గర్వం మాటలు నిన్ను చూసినప్పుడల్లా చెవిలో మారుమ్రోగుతుంటే అమ్మ జోలపాట విన్నంత హాయి వెన్నెల అంటేనే ఓ అందమైన అనుభూతి ఎన్నెన్ని మధురస్మృతులో నీతో ఈ యాంత్రిక జీవనంలో నిన్ను చూడకుండా ఎన్నిరాత్రులు గడుస్తున్నాయో తెలుస్తూనే ఉంది అందుకే ఓసారి గత జ్ఞాపకాల్లోకి వెళ్దాం చందమామ రావే ! జాబిల్లి రావే !!

సరిత భూపతి

// యత్ర స్త్రీ నాం సమానంతే //



// యత్ర స్త్రీ నాం సమానంతే // ఒకపుడు పెదవులపై సిగ్గుతో చెక్కిలిపై రెపరెపలాడే ముంగురులతో నవ్వే కళ్ళతో ఎంతందంగా కన్పించేది నీకు ఆ కళ్ళు వంటింటి గోడల నడుమ వర్షించినపుడు ఏనాడైనా అడిగావా ఆ తడి ఆరని మనసు వ్యధయేమని? "ధర్మేత్వయా ఏషానాతి చరితవ్య " బాసల్లో ఆమె పట్ల ధర్మం కరువై ఆఫ్ర్టాల్ ఆడదానివి అని వేలెత్తి చూపినపుడు మరిగిన రక్తాన్నడుగు ఆమె శక్తెంతో ఆమె సలహాలను కొట్టిపారేసి "నేను తప్ప నీకు వేరే ఆశలు,ఆశయాలు ఏముంటాయ్? " అని నవ్వుతూ నువ్వన్నపుడు ఆ ఎమోషనల్ బ్లాక్మేలింగ్కి ఆమె మనసు చెప్పుతో కొట్టి మరి ఆడగాలనుకుందేమో "అది నీకు వర్తించదా?" అని న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అన్న మన (మను) ధర్మగ్రంధాలను ప్రపంచానికి గొప్ప ఫెమినిస్టుగా అగ్గిలో కాల్చేసినంత సులభంగా "ఎంతైనా ఆడదంటే నా కంటే తక్కువే " అని మెదడులో తొలిచే పురుగును కాల్చి చూడు అపుడే నిజమైన మగాడివి, మనిషివీ అవుతావ్ 1 nov 15
.....
సరిత భూపతి
  .