28, డిసెంబర్ 2016, బుధవారం

మోహోజ్వలిత

// మోహోజ్వలిత//

ఎన్నేసి పున్నములు నింపుకొని వదిలిన ఈ వాకిలికి ఇప్పుడిహ నీ కళ్ళను చూపిస్తాను
మరెన్నడూ అమావాస్యలు ఒడిసిపట్టలేనంత కాంతికి ఎన్ని ముత్యాల ముగ్గుల ముద్దులైతే చాలునూ!

నిశ్శబ్ధంలో సడి చేస్తున్న ఆ పెదవులకు కాస్త చెప్పవోయ్
మెడ వంపుల్లో నలిగిన ఊపిరంతా ప్రేమోజ్వలనమేనని!
ఆకాశపు వాకిట్లో అరవిరిసిన నెలవంకలనేమీ అడగబోను కానీ ప్యారా .. మనసు లోతుల్ని చుంబించే మల్లెలంటి నీ నవ్వుల్నో గుప్పెడు అరువియ్యవూ!

ఆనందాలంటే కొనుక్కోలేనివేమీ కాదు..
మనసుల్ని మోహించేస్తున్న కాలాన్ని ఉన్నపలంగా ఒకింత కొనెయ్యటమే కదూ!
నీ నవ్వుల్ని దోసిళ్ళలో ఒంపుకున్న కాలాన్నంతా ఎన్నెన్ని కలల్ని కన్న కళ్ళతో కొనెయ్యగలనూ?

యారా! మసక బారని రాత్రులని
గాలిబ్ గీతాల్ని విన్న పిల్లతెమ్మెరలు గోముగా తాకుతుండగా
మనసుని శృతి చేస్తున్న నీ మాటల్ని నిండు వెన్నెల సాక్షిగా మళ్ళీ మళ్ళీ ఇలాగే..ఇలాగే అడుగుతాను
ఈ క్షణాల్ని ఎప్పటికిలాగే బంధించేయవూ అని!

-సరిత భూపతి

29/12/16

7, డిసెంబర్ 2016, బుధవారం

నోస్టాల్జియా

//నోస్టాల్జియా//
ఖరీదు కట్టలేని క్షణాలెన్నో
తామరాకుపై నీటిబొట్లైపోతాయి
కరిగిన కాలమంతా ముగ్ధలా
ఆ మేఘాల్లో ముడుచుకొని ఉంటుంది
మరెప్పటికీ అందుకోలేకపోయినా
పదే పదే మనసుల్లో వర్షిస్తూనే
ఎంతకాలమైందో నువ్వలా వెన్నెల్లా నవ్వి
మళ్ళీ ఓసారి నవ్వవూ!
ఎప్పటిలాగే దోసిట్లో నీ నవ్వులను పేర్చుకొని
మరో నిశిని అందంగా వెలిగిస్తాను
వెలుతురు పిట్ట ఒకటి ఎందుకో ముభావంగా చూస్తూ ఉంది
దూరాన పడమటి కొండల్లో కాంతిపుంజం స్పృహ తప్పి పడిపోయింది
నువ్వు ఎదురుచూస్తున్న ప్రభాతం
నీకు మాత్రమే కొన్ని యుగాల దూరంలో ఆగిందేమో
ఎగిరిపోయిందెక్కడికో ఆ వెలుతురు పిట్ట
గోధూళిలో అలా కనుమరుగయ్యేంతవరకూ వెళ్ళింది

సరిత భూపతి 
7/12/16