6, డిసెంబర్ 2017, బుధవారం

మారణకాండ

// మారణకాండ //

" యత్ర నార్యస్తు పూజ్యంతే.... "
అరిగిపోయిన రాతలకో ఫోర్ వర్డ్ అయిపోతుంది
"ధర్మేత్వయా ఏషా నాతిచరితవ్య" బాసలు
ఆమె కిరోసిన్ దేహానికో అగ్నిహోత్రం
శుక్రకణం మాత్రమే నిరూపించగలిగే మగతనం

విక్టిమ్స్ కి నీతులు చెప్పే లోకమిపుడు,
ఐదేళ్ళ ఆడపిల్లలు ఏ బట్టలేసుకోవాలో నేర్పటానికి
ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెడుతుంది
ఈలోగా, రోడ్డు మీద నెత్తరోడుతున్న ఓ పిచ్చిది
మతిస్థిమితం లేనందుకు మెుదటిసారిగా నవ్వి,
శవమైపోతుంది

చట్టం గాంధారీతనానికి ఆనందపడుతుంది
ప్రతిఘటించలేని ద్రౌపదుల ఆర్తనాదాలు గాలిలో
కలిసిపోతాయి
ఇంకేం రండి మరి! యోనుల రక్తాక్షరాలు ఉదయం పేపర్లో చదువుకుందాం, ఎప్పట్లాగే...హ్మ్!

-సరిత భూపతి
6/12/17

19, అక్టోబర్ 2017, గురువారం

చీకటి

// చీకటి //

తిమిరాన్నంతా తన వద్దే దాచేసుకొని
ప్రపంచానికి వెలుగులా చూపుకుంటున్న దీపం గురించి ఇపుడేం చెప్పనూ?

కొన్ని చీకట్లను ఎవరూ గుర్తించలేరు
నలుపులు పులుముకుంటున్న పర్వర్టెడ్ అథారిటీలకు
లోలోపలి తిమిరాన్ని ఎప్పటికీ వెలిగించలేనని
చూపాలనిపించుకోని సహజత్వం

వెలిగే దీపాల్లా కనిపించే నవ్వులన్నీ
నువ్వు చూడగలిగేవి మాత్రమే,
తన లోపలి చీకట్ల ప్రతిబింబాలే

చిమ్ము చీకటిలో లోకానికి వెలుగైన
ఓ గుడ్డిదీపపు లోపటి నలుపు
బయట మతాబుల శబ్ధానికి ఓసారి ఉలిక్కిపడింది
అవును, కొన్నిసార్లంతే..
      కొందరి ఆనందమూ, కొందరికి చివుక్కుమనేలా చేస్తుంది
అంధకారం లోకంలో కాదు
నీ లోపల అని అమావాస్య రాత్రి వెక్కిరించిపోతుంది

-సరిత భూపతి
19.10.17

9, అక్టోబర్ 2017, సోమవారం

patterns

// patterns //

రాలిపోతున్న ఉదయాలనో
వాడిపోతున్న పూలనో తలుచుకొని
ఒక సాయంత్రం కుమిలిపోతూ వుంటుంది
వేకువల కోసం ఆలోచించలేని కళ్ళు
మోడైపోయిన చెట్ల కింద
ఆకులు విడిచిన ముద్రలకు ఇపుడెక్కువగా విలపిస్తాయి
సరిగ్గా అపుడనుకుంటాను
నాతో లేవన్న విరహాల కంటే
నాలో వున్న జ్ఞాపకాల సాంద్రత ఎక్కువ కదూ అని !
అవును.. నువ్వు రాలేవన్న నిజం కంటే
నీ ఊసుల సజీవత్వమెప్పటికీ ఎనలేని సంతోషం

ప్రేమించబడాలనే ఆశలు లేని
డిటాచ్డ్ అటాచ్మెంటో విడువని తృప్తి
ఆజ్ రుస్వా తేరి గలియోఁమే మెుహాబ్బత్ హోగీ
అని శాపనార్థమేమీ పాడలేను కానీ
నువు రాక ముందు జీవితం గురుతైనా లేని
ఈ క్షణమెంతో హాయి

-సరిత భూపతి
9/11/17

6, సెప్టెంబర్ 2017, బుధవారం

ఏమీ లేదు
ఇక మనుషుల గురించి రాయటానికి ఏమీ మిగల్లేదు
కనపడని శక్తులంటూ మూఢత్వంలో మగ్గిపోతూ
నడిపించే శక్తులను క్రూరంగా చిదిమేస్తున్న
మనుషుల గురించి చెప్పుకోవటానికి ఇంకేమీ లేదు

అక్షరాలు ఉన్మాదాన్ని ఎదిరించినపుడు
ఈ మనుషులు కత్తులై కలాన్ని పొడిచేస్తారు
పిచ్చికుక్కలై సొంత జాతిలో కల్లోలాలు సృష్టించుకొని
కరిచి చంపుకుంటున్న ఈ మనుషుల కోసం జాలిగా
ఓ గొంతుక అరిచినపుడు దానికి ఉరివేస్తారు

constitution కలల్లో వింటున్న గొంతుకలు
ఎప్పుడో నులిమివేయబడ్డాయి
article 19 లో ఆ గొంతుకల ముద్రలు చెరిపివేసి,
కొత్త నీతులు లిఖించబడి చాలా కాలమైంది
Freedom of Murder !
Freedom of Rape !!

(senior journalist  Gouri lankesh shot dead by hindutva forces)

-సరితభూపతి
6/9/17

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Ecstasy

// Ecstasy //

కొన్నిసార్లు అకారణంగా
మనసు నవ్వుతూ ఉంటుంది
పొద్దున్న ఆ పసిపిల్ల
నేను తనకి తెలియకుండానే
నన్ను చూసి స్వచ్ఛంగా నవ్వినట్టు
నువ్వుంటే నవ్వుతానంతే, నీ ఊహైనా..
నువ్వుండటానికీ, నవ్వుండటానికీ కారణాలేమిటీ?
నువ్వే కారణం

ఏ atoms చేరుకోలేనంత దగ్గరగా
నువ్వొచ్చేస్తావు
మరే ప్రవరలు అక్కర్లేకుండానే.
మనసులకూ కరిక్యులం కావాలా!
అది గాలికన్నా వేగం

తెల్సా, నువ్వుండటం బావుంటుంది
"నువు లేని నన్ను ఊహించలేనంత" విరహాలేమీ తోచవు
నువ్వు లేకపోవటంలోనూ నువ్వే ఉంటావు

వర్షం వెలిసిన చీకట్లలో
చెట్లు దుఃఖించటమనీ ఎవడైనా భగ్నప్రేమికుడు
రాసుకొని ఉంటాడు
కానీ, రాలిన చినుకుల గురుతుల్లో
నువ్వెళ్ళిపోవటంలోనూ నువ్వే

నీ మాటలు అందనంత దూరంలో ఉన్నపుడు
ఒక్కోసారి ఆకాశంలోకి కళ్ళనిచ్చి
మబ్బుల్లో ఏడ్చుకుంటాను
అపుడు మాటలకన్నా,
కళ్ళని వినటం బావుంటుందని కదూ అంటావు!?
నిజంగానే ఆ కళ్ళని చూసి ఎవరో ఎక్కడో
పాడుకుంటూ ఉంటారు
కొంజి పేసిడ వేణం
ఉన్ కన్నే పేసుదడీ

-సరిత భూపతి
1/9/17

19, ఆగస్టు 2017, శనివారం

// స్తబ్ధత //

కొన్నిసార్లు ఆకాశం విచారంగా
నల్ల మబ్బుల్లోపల ఎందుకో రోదిస్తూ ఉంటుంది
ఒకసారి నీళ్ళై పగిలిపోతూ
మరోసారి నీకోసమే రాలిపోతూ
ఇంకోసారైతే నీ నవ్వుల్లో కరిగిపోతూ
నిజానికి దానికన్ని కళలేమీ రావు
అన్ని ఎమోషన్స్ ని చూపించలేదు
క్యూమ్యూలోనింబస్ నీళ్ళ చుక్కల్ని
నీ అనంత దుఃఖంలో చూస్తూ
డైమన్షన్లెస్ స్తబ్ధతలకు
అన్నెసస్సరీ ఇమాజినేషన్ నీకొక ఓదార్పు

బాధని అనుభూతించటం నిజానికి
బాధేమీ కాదు
నువ్వుండాలి, నీలా కొన్ని ఉన్నట్టు నువ్వూహించాలి
నీకోసమే ప్రకృతి రోదిస్తుందని
పువ్వులు రాలిపోతున్నాయనీ
నువ్వసలైన బాధని దాటి, ఇవన్నీ అనుభూతించాలి
కన్నులు కలలు కనటం మర్చిపోయినపుడు
ఆ తడినైనా సరే నువ్వు రాయాలి

-సరిత భూపతి
19/08/17

26, జులై 2017, బుధవారం

మబ్బు గుర్తులు

// మబ్బు గుర్తులు //

ఒక్కోసారి ఆకాశం దోసిట్లో దూకి, అరచేతుల్లో ముద్దిచ్చి పోతుంది
ఎప్పటికీ ఉండిపొమ్మని అడుగుతాను
నువ్వు అవనివై ఉండగా నేనెలా వదిలిపోగలనని ఆ మొక్కల మోముల్లో కురిసి వొదిగిపోతుంది
తన రాల్చిన గుర్తులు పువ్వుల్లోంచి నా నవ్వులుగా వొంపుకుంటాను
ఆ క్షణం విరహాన్నీ ప్రేమిస్తాను
నీ చినుకుల కబుర్లు
నువ్వెళ్ళాక నీ గురుతుల గుసగుసలు
నాకు నేను అందనంత దగ్గరగా నన్ను చుట్టేస్తాయి
అవును..చేరువైనా, దూరమైనా ఆనందమే !
కప్పు కాఫీతో నిన్నూహిస్తూ పాడుకుంటాను

నిన్ను ఇచ్చేయమని అడుగుతాను
నన్ను శూన్యం చేసి, నీలో నన్ను కొత్తగా చూపుతావు

-సరిత భూపతి
27/7/17

7, జులై 2017, శుక్రవారం

ఫికర్ మత్ కరో భాయ్

ఇక్కడ ప్రతివాడూ స్వలాభం కొరకే
'స్వేచ్ఛంటే నువ్విచ్చేది కాదు
నేను తీసుకోగలిగేది' అని ఆమె అరవలేదెందుకో!
లోకంలో నిర్భయలంతా ఇపుడు కాఫీ బ్రేక్ న్యూస్ లు అయిపోతారు
కఠినపు ఛేష్టలు చూసీ చూడనట్టు సమాజం, కళ్ళు మూసుకొని కటోపనిషత్తు చదువుకుంటూ ఉంటుంది

ధర్మేత్వయా ఏషా నాతిచరితవ్య బాసల్లో ధర్మం, ఆనాడే పాతివ్రత్యం నిరూపించుకోలేక మంటల్లో కాలిపోతుంది
ఇపుడు పడతులంతా కిరోసిన్ మంటల్లో పవిత్రులైపోతారు

బొట్లు,కుంకుమలు ఆడదాని పిట్యూటరీ గ్లాండ్ల జన్మ హక్కన్నట్టు, ప్రభుత్వం పన్ను లేకుండానే మెుహాన కొడుతుంది.కానీ,
చీకిపోయిన మైలగుడ్డల ఏడుపులు గ్రామాల్లో బడిదాకా పోనియ్యవు చూడు
ఫికర్ మత్ కరో భాయ్, ప్రభుత్వం ఆదాయం చేసుకుంటుంది
ఎంతైనా, నాప్కిన్ల కోసం Menstrual system నిరసన చేయలేదు కదూ!

టోర్న్ బట్టలు ఫ్యాషన్ చేసి, ఒంటి మీద నుంచి పెట్టికోట్ కనపడితే మిర్రున చూసే లోకంలో FreeTheNipple compaign లను చూసి ఇపుడు నవ్వాలో, ఏడవాలో!!

నిజమేరా, కల కన్నవాడు లేకపోయినా వాడి కల బతికేఉంటుంది
నీతులు లిఖించిన మనువు ఇపుడు లేకుంటే ఏం? అడుగడుగునా 'మనువు'లే.
ఫికర్ మత్ కరో భాయ్
వినేవాడికే విలువలు

-సరిత భూపతి
1/7/17

29, మే 2017, సోమవారం

paroxysm

// paroxysm //

అలిగి వెళుతోవున్న మేఘం
అంచున పరిగెడుతూ ఎవరో బతిమాలుతూ ఉన్నారు
కాసేపటికి లోకం కళ్ళు మూసుకుంది
గుడ్డిదీపం ఒకటే నవ్విన చప్పుడు
మేఘం కల చెదిరిందేమో
కనీసం దానికి చెప్పుండాల్సింది
చీకటి పరుగులు మోస్తో
మరెవరూ వెనకాలే ఉండబోరనీ

తూర్పు అంచున రోజుకో ప్రసవం
నెత్తుటి కిరణాల పారాక్సిజమ్తో
ఉరిపోసుకున్న చీకటి , రెక్కలు కొట్టుకుంటూ
విలవిల్లాడి ఇక పోయింది

ఆపలేని ఒత్తిడిలో బండరాళ్ళను పగలగొట్టాలన్న ఆవేశంతో ఒక అల
కుంచెల ఊపిర్లు అలుముకున్న రంగు చుక్కలూ
చిత్రం కార్చిన ఆనందభాష్పాలే కదూ!

ఏడుస్తావే..
అది మరి నవ్వో, ఏడుపో
మనసు అణచలేని అవ్యక్తభావమెుకటి ఉన్నట్టుండి
కళ్ళల్లో జారిందేమో
ఏ చీకటికీ అందని మేఘమెుకసారి
చెంపల మీద నుంచి జారుతూ మెరిసింది

-సరిత భూపతి
29/5/17

7, మే 2017, ఆదివారం

లిట్మస్

// లిట్మస్ //

మెుక్కలు తాగుతున్న పత్రహరితాలు
నువ్వు అకారణంగా మోస్తున్న రంగుల్ని చూసి కమిలిపోతాయి

నిశ్చలత్వం మాత్రమే బాగుంటుందనుకున్న నదిలోకి ఎవరో రాయి విసిరేస్తారు
అలిగిన వెన్నెల ప్రతిబింబం ముక్కలైపోతుంది

ఎక్కడో ఎవరో వెక్కి వెక్కి ఏడుస్తున్న చప్పుడుకు ప్రశాంతమైన స్మశానమూ ఉలిక్కి పడుతుంది

నవ్వు కూడా ఏడుస్తుండటం ఎపుడైనా చూసావా
గొంతులో ఇంకుతున్న బాధ నొప్పి నువ్వు తప్ప అందరూ నవ్వనుకుంటారు

అవును..
చీకటి, సముద్రం, బాధ.. కొన్నింటిని వాటిలాగే ఉంచాలి

సరిత భూపతి

  1. 7/5/17

23, ఏప్రిల్ 2017, ఆదివారం

// కీకారణ్యం //

ఒకచోట సగం విరిగిన కుర్చీ
వసారాలో పడి ఏడుస్తూ ఉంటుంది
వచ్చీ పోయే మనుషులు దానికి సంతాపం చెప్తున్నారో
వాళ్ళకది నిశ్చలం నేర్పుతుందో మరి
అదే మూలన ఆర్తనాదంతో చెక్కబల్ల మూలుగులు
దానిపై ఎప్పటికీ ఎవ్వరికీ వినాలన్పించని
ఎండిన ఎముకల రొదతో మనిషి వాసన
కొన్నంతే..అసలేమీ చెప్పుకోనవసరం లేకుండానే
అసలేం చెప్పబుద్ధేయకుండానే
చాలా మామూలుగానే ఉంటాయి

మరో చోట ఎవడో పార్న్ స్టార్ ఊరువుల మీద
పడి ఏడుస్తున్న వాడి మీద పడి ఏడుస్తాడు
వాడూ వీడూ పడీ పడీ రాసుకున్నా కనీసం బూడిదైనా రాలదే
సోకాల్డ్ దేశభక్తి వీరులు అమ్మా.. ఇంత బూడిదైనా మిగిలిందని వీరతిలకం చెరిపి భరతమాత నుదుట పుయ్యటానికి

ఆదిపరాశక్తి అని పిలిచి ఆమ్లెట్ లా మింగేసే
ఆవారాగాడొకడు మెుగుడు చచ్చిన దాని నుదుటన పిట్యూటరీ గ్లాండ్లు పనిచేయక్కర్లేదని తలరాతను లిఖిస్తాడు
ఆమెకు ఎవరో ఆడతనం ఆపాదిస్తే అరువిచ్చిన నుదుటుని మళ్ళీ ఎవరికోసమో వదిలేసి పోతుంది
రక్తపు తిలకాలు కళ్ళల్లో సుడులు తిప్పుతూ
పగిలిన గాజుముక్కల్ని మదపుబుద్ధిపై గునపాల్లా గుచ్చి నడిచి ఉంటే ఆమె ఎప్పటికీ పార్వతీ దేవే

ఎవరి గొంతుకలో నులిమేసిన చప్పుళ్ళు విన్నట్టు
ఆకాశం ఎప్పటిలానే రోదిస్తూ ఉంటుంది
ఎవరెవరి దుఃఖమో మోయలేక భారమైపోయిన
ఆకులు రాలిపోతూ ఉంటాయి
గుండెలవిసిపోయే ఆందోళనలోనూ సముద్రం అలలు
హిందోళంలో పాడుకుంటూ ఉంటాయి ఎప్పటిలానే
యేటా ఎవడో జెండా ఎగరేసి
మిగిలిన రోజుల్లో కాళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు
గానుగెద్దులు దున్నిన భరతభూమి
గొడ్రాలై  రోదిస్తూ ఉంటుంది
ఎవడ్రా అది..ఇంకా పాతచింతకాయ పచ్చళ్ళు నాకేది?
ఇక దేశమంటే మనుషులెప్పటికీ కాదు
కనీసం మట్టైనా కాదు

-సరిత భూపతి
23/4/17

16, ఏప్రిల్ 2017, ఆదివారం

థాట్ ప్రాసెస్ అనబడు పిండి గిర్నీ :

  రుబ్బి రుబ్బి వదిలిపెట్టు పదికోట్ల పనికిమాలిన ఆలోచనల ఫలమేమి? ఎగిరి గంతువేయు ఒక్క ఊహ చాలదూ! విశ్వదాభిరామ చెప్పు వెర్రి వేమా! అహో పనికిమాలిన ఆలోచనలన్నీ ఎగిరి గంతేసే ఆలోచన రావటానికే కదూ! కాదూ? A thought may not be perfect all the time, but improving it makes it a thousand times better. వెధవ ఘోష ఎందుకోయి తోటమాలి...అవునూ! విత్తనాలు ఎన్నెన్ని కలలు కన్నాక పూలయ్యాయో.
సెకను సెకనుకూ ఉరి వేసుకుంటున్న కాలం గొంతుకకు ఆలోచనల తాళ్ళు పేనుతూ మూడు పౌండ్ల మాంసం ముద్ద. వయస్సులు పెరిగినా యవ్వనం దాటని ఓసి బుర్ర ఎక్కువ బుర్రా! నీకూ తప్పలేదుటే అసంకల్పిత ప్రతీకారచర్యల వెక్కిరింపులు. అన్ని డిప్పలూ పగులుటకే పుట్టిన మరి పుర్రెకో బుద్ధి ఏల పురుషోత్తమా!
ఒకానొక పచ్చి మెదడు ప్రాతఃకాలాన సర్ఫెక్సల్ తెలుపులో ఎదురుచూపుల ఎండు పేపరు ముక్క, పాయింటు బ్లాంకున పెన్నే కదలనిచో బుల్లెట్టు దిగును గన్నై. రా..రా మెుప్పలు చీల్చి, రెక్కలు విరిచి, రివ్వున ఎగిసి, రయ్యున కురిసి....బొజ్జ నిండా మెక్కి ఊరకుండక పెన్నులతో పొడుద్దామని బయలుదేరిన మనిషి మెదడుకు ఎంత కష్టం ఎంత కష్టం. ఇరుకు బెరుకు గరుకు దారిలో తళుకుమన్న మెదడు పలుకకు మెలిక తిప్పుతూ పలుకు నేర్పుతూ హేవిటోయి బాటసారి వెర్రి వేయిన్నొక్క విధములోయి అయిననూ ఎంతైననూ యుద్ధం లేని మెదడులెపుడూ వ్యర్థం వ్యర్థం అది ఇక చచ్చిందనే అర్థం. వెతుకు దానికెపుడో పరమార్థం ...ర్థం..థం..థం..థం

మెదడే మాయ బతుకే మాయ.. సరిద్గీతలో సారమింతకుమించయా!

#సరిద్గీత
#మెదడోపాఖ్యానం ఆదివారమర్థరాత్రివేళలో...

-సరిత భూపతి
16/4/17

26, మార్చి 2017, ఆదివారం

విలాసిని

// విలాసిని//

మనసు కొమ్మలు పూయించుకునే
ప్రేమావేశపు ఆశల సందేశాలు
ఎన్ని మైళ్ళ దూరాలైనా అలుపు రాక
నిన్నొచ్చి చుట్టేసే ఊహల పావురాలు

నువ్వు నీలాగే నేను నాలాగే ఉండక్కర్లేదు ప్రతీసారి
నువ్వు చాలా రకాల నీవుల్లాగా నేను చాలా రకాలుగా నేనులాగా ఉంటే ఏం?
నా కలలన్నీ ఎంత గొప్పవో తెలుసా నీకు
అన్నింట్లోనూ నువ్వే
ఓసారి పాపాయి నవ్వుల్లో వచ్చి పువ్విచ్చిపోతావు
మరోసారి ఎక్కడా ఆగాలనిపించని నడక దారిలా, మరెపుడూ చదవటం ఆపాలనిపించని పుస్తకంలా వస్తావు
మరి అవన్నీ నువ్వేనని నవ్వేలోపు కల భల్లున పగిలిపోతుంది

ఇహ ఈ వెన్నెల రంగు పులుముకున్న నీ దేహన్ని
ఈ రేయి అనుకువగా అప్పడుగుతోంది ..ఇచ్చేద్దూ!
మనసులు విచ్చుకోలేని ప్రేమలు కదా మలినాలు
మరి ఇది చెప్పు.. నా కళ్ళల్లో నీ నవ్వుల్ని రింగులు చుట్టటం ఎక్కడ నేర్చుకొని వచ్చావో
ఇహ తక్షణం నీ చేతుల్లో కుందేలు పిల్లనైపోవాలి
అపుడిక మనసుకు పట్టిన గాయాలేవీ
నీ స్పర్శ వల్ల సలపవు కదూ!
నమ్ము.. ఎప్పటికీ అవలేని ఊహలన్నీ అద్భుతాలే !

సరిత భూపతి
27/3/17

26, ఫిబ్రవరి 2017, ఆదివారం

వెన్నీల అలక

// వెన్నీల అలక //

ప్రతీరాత్రిలాగే కొన్ని కబుర్లలా చెక్కి ఉంచాను
వెన్నెల అలిగింది వినటానికి రాలేదు
నీ నవ్వులు కొంచెం దాని బుగ్గన పూసేస్తాను
ఇక మరెప్పుడూ చిన్నబోనంతగా అదీ నవ్వేస్తుంది

నిన్ను వినిపించినపుడల్లా చీకటి దారుల్లో నడుస్తూ
నీకోసం వెతుక్కుంటూ ఉంటుంది
నీకో వెలుతురు గీతం చూపించాలనే నా కబురు
నీ వరకూ మోసుకొచ్చి గుప్పెడు కలువల్ని
నీ కన్నుల వాకిళ్ళలో పేర్చి
ఇక ఎక్కడికో పోతుంది నా నిద్రలో కలైపోతుంది
మళ్ళీ ఎపుడొస్తావని నేను అడగను
అడగకపోయినా ఆత్రంగా వొచ్చేస్తుంది
నిన్ను చూడ్డం దానికంతిష్టం,  అంతే అసూయ మరి

నువ్వు నవ్వటం వెన్నెలకన్నా హాయిగా ఉంటుందన్నపుడు
దానిక్కానీ వినపడిందేమో
మచ్చలేని చంద్రుని నవ్వు హయే మరి
అని అలిగి వెళ్ళిపోయింది
ఈ వేళ రానేలేదు

-సరిత భూపతి
26/2/17

22, ఫిబ్రవరి 2017, బుధవారం

A Night in the snow

A Night in the snow

అరమోడ్పు కళ్ళల్లో నలిగి
గారాలు పోతున్న గులాబీ రెక్కల దేహం
మెడ వంపున దారి తప్పిన అధరానికి తోడుగా
వెచ్చని ఊపిర్లలో బంధీలయిన
నైట్ క్వీన్ పరిమళం

కడలి కెరటాలను మోసుకొచ్చి
పాదాలను ముద్దాడించలేనేమో కానీ
నువ్వు నవ్విన ప్రతీసారి నదినై
ఆ కళ్ళల్లో దాగిపోయి ఓ గుల్జార్ కావ్యాన్ని
గాలితో కబురంపలేనూ కనీసం!
ప్యారా..నీలో ఒదిగిపోవటం కంటే
ఇపుడిక గొప్పగా మరింకేమీ లేదు
నదియే నీయానాళ్ కడలే నానే
సిరు పరవై నీయానాళ్ ఉన్ వానమ్ నానే

ఈ రాత్రి వెన్నెలతో ఏకాంతంగా
చుక్కల్ని దిద్దుతోంది
మబ్బు తుణకలు సిగ్గుపడుతోన్న చప్పుడు
నువ్వు గానీ నవ్వావా? వెన్నీలంతా ఒళ్ళో దూకేసింది
పరవశించిన నిశి దేహపు తన్మయత్వానికి సాక్ష్యాలేమో
మలిపొద్దున పువ్వులపై మెరుస్తున్న మంచు బిందువులు
ఇహ నువ్వు నాకు నేను నీకూ మిగిలిపోవటం
ఎంత బావుందో కదూ!
మరి నాతో అలా వచ్చేద్దూ..
ధడ్కనోన్ కే పాస్ మే
హన్ పాస్ మే ఘర్ జనాయే
హయే భూల్ యా జహాన్


-సరిత భూపతి
23/2/17 

20, ఫిబ్రవరి 2017, సోమవారం

A Dark song

// A Dark song //

పడమటి దారులెంత దూరంగా ఉంటాయో తెలుసా
ఎప్పటికీ అందుకోవాలనిపించనంత దూరంగా
వెళితే తిరిగి రావాలనిపించనంత దూరంగా
ఉషోదయాల్ని కోరుకోవటం మాత్రమే బావుంటుంది
ఆ కోరుకోవటం మానేసాక గుడ్డిదీపాల్ని వెలిగించటం మరెవరూ నేర్పరు..అసలక్కర్లేదేమో

పైరగాలి పెదవంచున నిశ్శబ్ధాలు
తీరం లేని కాలినడకలు
మన్ను తాకిన మిన్నుల్లో కాయితప్పడవలు
ఇక మరెన్ని నోస్టాల్జియాలు
నిన్ను మాత్రమే మిగిల్చినపుడు
నవ్వుకో ఏడుపుకో కాసేపు నిన్ను నువ్వు అరువిచ్చేసి
మళ్ళీ తిరిగొచ్చెయ్
శూన్యం మాత్రమే దోసిట్లో ఒలకబోస్తున్న దారుల్లోకి
అసలేమీ వినిపించనంత ఇంకేమీ కనిపించనంత నీలోకి
ప్రేమించబడాలనే ఆశలేమీ లేనపుడు
ప్రేమించటం మాత్రమే నేర్చుకున్న నీలోకి

-సరిత భూపతి
21/2/17

అదంతే

// అదంతే //

ఆకాశపు రంగు నిద్రల్లో
అలసిపోయిన చుక్కల కల
ధ్వంసమవుతున్న ప్రతీసారి
ఇలలో కూలిపోతున్న మబ్బు కళ్ళ దుఃఖాలు
అచ్చూ ప్రతీ రాత్రిలానే

కాలం అంతే..అలాగే ఉంటుంది
ఒకనాటి మల్లెల నవ్వులు
నీకిపుడు నవ్వుగానే తోచదు
గగనపు కొనల్లో రెక్కలు కట్టుకొని
కనుచూపు మేరల్లో విహరిస్తున్న
బుల్లిపిట్టను చూసినా ఇపుడు నీకెందుకో అసూయే మరి!

వచ్చి వెళ్ళిపోయిన దారుల్లో
తిరిగి మళ్ళీ మళ్ళీ నడవటం అంటే
జ్ఞాపకాల్ని ఒంపుకోవటమే కాదా!?
దూరాల్ని కొలవటం బాధే మరి
మానుకోరాదూ

అపుడే పురుడు పోసుకుంటున్న
సొంతగూటి పిట్ట ఎగరాలనుకోవటమూ
నీకు స్వార్థపు వాసనేసినపుడు
ఇక మరేదీ ఇష్టంగానే తోచదు
పువ్వు నవ్వాలనుకోవటం
నువ్వు నవ్వాలనుకోవటం కూడా

-సరిత భూపతి

20/2/17

9, ఫిబ్రవరి 2017, గురువారం

మరీచిక

// మరీచిక //

ప్యారా!
ఎన్ని పదాలు అల్లినా అది నువ్వవలేనపుడు అసలింకెలా చెప్పగలను?
కానీ నీకిపుడు చెప్పాలి
కాస్త నిశ్శబ్ధాన్ని కూడా వినగలిగినపుడు
ఏమీ చెప్పలేనితనాన్ని కూడా కొన్నిసార్లు చదవాలి
దిగులుగా శూన్యంలో నడుచుకుంటూ ఉంటాను
కీచురాళ్ళు భయపడుతున్న మూలుగు
చీకట్లు ఉళిక్కిపడేంత నలుపు
వణికిపోతున్న గుండెపుడో స్పందించటం మానేసింది
దారే తెలియని దారిలో దారి తప్పిపోయాను
ఎక్కడ్నుంచి వచ్చిందో కళ్ళు పొడుచుకెళ్ళేంత ప్రకాశవంతంగా ఒక కాంతిపుంజం
నా వెనకాలే వెతికి పట్టుకున్నట్టుగా ఓ మరీచిక
ఆశ్చర్యకరంగా అది నువ్వే..
బతకటం ఎలా బావుంటుందో
నువ్వే చెప్పాలి..నువ్వు మాత్రమే
పగిలిపోయిన నీటిచారలు
ముభావంగా ఆకాశంకేసి చూస్తున్నపుడు
పెట్రికోర్ సువాసనల్లా సాంత్వననిస్తూ నీ మాటలు
నువ్వొచ్చావని చెప్పనా...వానొచ్చిందనా?
అలా స్వాతివానలో కాసేపు ఒలికిపోతాను
నువ్వుండటం ఎంత బావుంటుందో తెలుసా
కాదు..అసలు నువ్వున్నావనే ఊహే ఎంత బావుంటుందో తెలుసా!
అమ్మ లాలిపాట ఇంకా వింటున్నాననే భ్రమలోనే
ఆదమరిచి నిదిరిస్తున్న పాపాయి మోములా

-సరిత భూపతి
9/2/17


ఒంటరితనం

//ఒంటరితనం//

చిమ్ము చీకటి లేదు
కారడవి కాదు
కళ్ళు పొడుచుకున్నా కనపడని గుడ్డితనమూ లేదు
ఉన్నదంతా గుండెల నిండా పేరుకుపోయిన
నిర్వికారం..నిశ్చేష్టం

మనుషులు కనపడని ఎడారిలో లేను
పాదం కందనివ్వని రెడ్ కార్పెట్ అడుగులో
నాలుగు అద్దాల గోడలు గాజు కళ్ళేసుకొని
వెక్కిరిస్తున్న అలజడో
గట్టిగా కుదిపివేస్తూ ఆవరించిన ఒంటరితనం

నా ఊపిరి నాకే
చెవుల్నిండా పేరుకుపోయి
నిశ్శబ్ధం చేస్తున్న భయంకర శబ్ధం
భరించలేని ఒంటరితనం

ఆలోచనల కుప్పలన్నీ
అవశేషాలై మిగిలిపోతుంటే
పిచ్చెక్కినట్టు అరవాలనిపించే ఒంటరితనం
ఒంటరితనం బాధో, వరమో
మరెవర్నీ అడగాలనిపించని ఒంటరితనం

-సరిత భూపతి
15/7/16

జిందగీ

//జిందగీ//

దూరంగా ఓ తీతువు పిట్ట నవ్వింది
బతికున్నందుకు పోరాటమా
మరణం కోసం ఆరాటమా అర్థంకాని నవ్వు

బండరాళ్ళ నడుమ అమాయకంగా జారి
మరో దారిని వెతుక్కుంటూ ఎక్కడో
అంతర్థాన మైపోతున్న నీటిపాయ

ఆకుపచ్చ చీరలంతా నెరసిపోతున్నా
బంగారమని మురిసే మాగాణి పిల్లగాలులు

దూరంగా మళ్ళీ అదే నవ్వు
అదే తీతువు పిట్ట
పడమటి కొండల మీద దూరంగా పయనిస్తూ
జీనా యా మర్నా ఇన్ దోనే మే
కీసీ ఏక్ జిందగీ పరిభాషిత్ కర్నా
బహుషా ఇదేనేమో ఆ నవ్వుకు అర్థం

సరిత భూపతి
2/7/16

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

// కాఫీ కా కహానీ //

విను..
కుప్పలుగా పేరుకుపోయిన గతాలన్నీ
నిన్నటికి సాక్ష్యాలు మాత్రమే
రేపటి పురోగమనాలు చూసి నవ్వనీ..
మరలి రాకు గతమా
మధురమైన వేళ
గడిచిపోయినవే బావుంటాయా?
కొన్ని బాధగా కూడానేమో!

నిశ్శబ్ధాన్ని కళ్ళు మూసుకొని
మనసుతో వెతుక్కుంటున్న రాత్రుళ్ళు
అపుడే ఆవలిస్తూ చీకటి
మంచుపొగలకు పోటీలుగా కాఫీ సెగలు
సిప్పు సిప్పుకి మనసును
స్పృశిస్తున్న కహానీలు
దూరంగా ఏదో శబ్ధం
బహుషా నీ తలపొకటి నవ్విందేమో!

సరిత భూపతి
5/2/17

4, ఫిబ్రవరి 2017, శనివారం

తక్షణం ఇపుడొక కిరణజన్యసంయోగక్రియనై
నెలుంబోన్యూసిఫెరాల జననానికో కేంద్రమవ్వాలి
అవును..నీ నవ్వో కలువైతే ఫోటోసింథసిస్ లకి వెలుగంతా నీ దోసిళ్ళలో ఒంపి
క్లోరోఫిల్ ని అయిపోవటం నాకిపుడు నేర్పవా ముందు

ఓ లోలకమై నీ మనసు గదిలో పచార్లు చేస్తున్నపుడు
ఆంప్లిట్యూడ్ ని కొలవటం మాని ఆట్టిట్యూడ్ ని తెలుసుకోవటం
నువ్వూ ఇపుడు తక్షణం నేర్చుకోవలసిన విద్యే మరి!

జీవితం ఒక శూన్యబిందువైతే
నువ్వూ నేనూ sin(theta)+cos(theta) లమై కలిసిపోయే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఒకటి కావాల్సిందే మరి!

2, ఫిబ్రవరి 2017, గురువారం

హైబర్నేషన్

// హైబర్నేషన్ //

కళ్ళు తెరిచి కకూన్లలో పొదువుకుంటూ
ఇంకా ఎగరలేమేమని దిగులా
మనం పట్టిన కుందేలుకు
కాళ్ళెపుడూ మూడే కదూ కూపస్థ మండుకా!

రక్షణో శిక్షో తెలియదు కానీ
ఇపుడిది చేయాలి ఇది చేయకూడదంతే..
రూలేమిటో తెలియని రూత్లెస్ గొర్రెలం
రామా కనవేమిరా!

కమనీయ ముసుగుల మాటున
కర్కషపు పాదాల తొక్కళ్లలో
కలలెన్ని నలిగాయో కనికరములేదే
డీమస్క్  పెర్ఫ్యూమ్లు నాభిన దాచుకొని
పరిమళించలేని డిటాచ్డ్ జిందగీలో
మెర్సీలెస్ మయసభలు
కళ్ళు తెరువు గాంధారి..ఇంకొంత నవ్వేవూ!

సరిత భూపతి
2/2/17

1, ఫిబ్రవరి 2017, బుధవారం

ప్రశాంతత

// ప్రశాంతత//

ఏ బాదరా బందీలేని కొన్ని మౌనాలు కావాలిప్పుడు
ఆడంబరాలన్నీ శూన్యమైన నిశ్శబ్ధం కొద్దిగా కావాలిప్పుడు
మనసులో నిక్షిప్తమై ఒత్తిడి పెంచుతున్న పనుల చిట్టా టెంపరరీగా రిమూవ్ అయిపోవాలిపుడు

ఎంత యాంత్రికమైపోయాం మనం
ఉదయం పూట లీలగా వచ్చి పలకరిస్తున్న పిల్లగాలిని
గాబరాగా సింక్ నీళ్ళతో స్నానం చేస్తున్న వేడి పప్పు కుక్కర్ ఎప్పుడూ డామినేట్ చేస్తూ ఉంటుంది

ఆఫీస్ నుంచి వస్తూ బురదలో ఆనందంగా ఎగురుతున్న పిల్లల్ని చూసి ఏం కోల్పోతున్నామో గ్రహించే లోపే
చీకటి పడితే బస్ మిస్సయిపోతామన్న భయం తొందరపెడుతుంది

ఇన్ని గంధరగోళాల తర్వాత మళ్ళీ ఉదయన్నే మేల్కోవాలనే గుబులు
శిథిలావస్థలో ఉన్న పాత టేప్ రికార్డర్ మూలుగును నొక్కపెట్టేస్తుంది

రోజంతా గజిబిజిగా విలవిల్లాడుతున్న మనసుకు
కొంత ప్రశాంతత కావాలిపిడు
ఒక నిశ్శబ్ధ శబ్ధాన్ని గుండెల నిండా నింపుకోవాలనుందిపుడు 

20, జనవరి 2017, శుక్రవారం

సుశుప్త

// సుశుప్త //

మసిపట్టిన నింగిలో ఎన్నాళ్ళని వెలుగుతావూ?
అయినా మలిపొద్దున కలిసే ఉషోదయాలు నిన్నెన్నడు గుర్తించాయనీ!
మసకబారిన మనసులకు సాక్ష్యాలుగా
అలా ఎన్నెన్ని లిప్తలు గడిపోతాయో
నిశీధుల్లో నువ్వూ నేనూ అలా చుక్కల్ని లెక్కిస్తూ

కాలాన్ని మరిచిన ఊహల కవనాలతో
అలసటలేని ఎదురుచూపులు
విలపించటమూ గుర్తురాని సుశుప్తలో
వేసవి తెమ్మెరలాంటి విరహాలు

ఇంకా ఎన్నెన్ని తిమిరాలు నిన్నిలా కలిపేసుకోవాలనీ నిరీక్షణ అని లెక్కలడక్కు..
చెక్క అల్మారీ మీద టేపు రికార్డరు
మనసులోనే ఎందుకో విలపిస్తోంది
ఎంతకాలంగానో మరి..
'నీవు రావు నిదుర రాదు'..
దాని గొంతెపుడు మూగబోతోందో తెలీదు
ఈ నిరీక్షణ ఇప్పట్లో ముగుస్తుందని నమ్మకంగానూ లేదు

సరిత భూపతి
20/1/17

17, జనవరి 2017, మంగళవారం

అల్విదా

// అల్విదా //

నటించు
డైమన్షన్లెస్ జీవితాల
కాంప్లికేటెడ్ అవసరాలకు
సెంటరాఫట్రాక్షన్ ఈ నటనే కదూ!

వర్త్లెస్ పకపకలకు వెంపర్లాడే
స్వార్థపు మయసభలివి
ఎండిపోయిన ముసుగుల్లో
ఎన్డ్ ఆఫ్ ద డే బఫూన్వేనోయి

అలా నవ్వకు
గిరి గీసుకున్న సెల్ఫ్ సెంటర్డ్ బతుకులు
తిరిగి వెక్కిరించేస్తాయి
గుప్పిళ్ళలో బంధించిన మనసులెపుడో
పొలిమేరలు దాటేసాయని తెలిసీ
పిడికిలింకా విడవని మోసపూరిత
జిందగీలకిహనిక అల్విదా!

-సరిత భూపతి
17/1/17