6, సెప్టెంబర్ 2017, బుధవారం

ఏమీ లేదు
ఇక మనుషుల గురించి రాయటానికి ఏమీ మిగల్లేదు
కనపడని శక్తులంటూ మూఢత్వంలో మగ్గిపోతూ
నడిపించే శక్తులను క్రూరంగా చిదిమేస్తున్న
మనుషుల గురించి చెప్పుకోవటానికి ఇంకేమీ లేదు

అక్షరాలు ఉన్మాదాన్ని ఎదిరించినపుడు
ఈ మనుషులు కత్తులై కలాన్ని పొడిచేస్తారు
పిచ్చికుక్కలై సొంత జాతిలో కల్లోలాలు సృష్టించుకొని
కరిచి చంపుకుంటున్న ఈ మనుషుల కోసం జాలిగా
ఓ గొంతుక అరిచినపుడు దానికి ఉరివేస్తారు

constitution కలల్లో వింటున్న గొంతుకలు
ఎప్పుడో నులిమివేయబడ్డాయి
article 19 లో ఆ గొంతుకల ముద్రలు చెరిపివేసి,
కొత్త నీతులు లిఖించబడి చాలా కాలమైంది
Freedom of Murder !
Freedom of Rape !!

(senior journalist  Gouri lankesh shot dead by hindutva forces)

-సరితభూపతి
6/9/17

1, సెప్టెంబర్ 2017, శుక్రవారం

Ecstasy

// Ecstasy //

కొన్నిసార్లు అకారణంగా
మనసు నవ్వుతూ ఉంటుంది
పొద్దున్న ఆ పసిపిల్ల
నేను తనకి తెలియకుండానే
నన్ను చూసి స్వచ్ఛంగా నవ్వినట్టు
నువ్వుంటే నవ్వుతానంతే, నీ ఊహైనా..
నువ్వుండటానికీ, నవ్వుండటానికీ కారణాలేమిటీ?
నువ్వే కారణం

ఏ atoms చేరుకోలేనంత దగ్గరగా
నువ్వొచ్చేస్తావు
మరే ప్రవరలు అక్కర్లేకుండానే.
మనసులకూ కరిక్యులం కావాలా!
అది గాలికన్నా వేగం

తెల్సా, నువ్వుండటం బావుంటుంది
"నువు లేని నన్ను ఊహించలేనంత" విరహాలేమీ తోచవు
నువ్వు లేకపోవటంలోనూ నువ్వే ఉంటావు

వర్షం వెలిసిన చీకట్లలో
చెట్లు దుఃఖించటమనీ ఎవడైనా భగ్నప్రేమికుడు
రాసుకొని ఉంటాడు
కానీ, రాలిన చినుకుల గురుతుల్లో
నువ్వెళ్ళిపోవటంలోనూ నువ్వే

నీ మాటలు అందనంత దూరంలో ఉన్నపుడు
ఒక్కోసారి ఆకాశంలోకి కళ్ళనిచ్చి
మబ్బుల్లో ఏడ్చుకుంటాను
అపుడు మాటలకన్నా,
కళ్ళని వినటం బావుంటుందని కదూ అంటావు!?
నిజంగానే ఆ కళ్ళని చూసి ఎవరో ఎక్కడో
పాడుకుంటూ ఉంటారు
కొంజి పేసిడ వేణం
ఉన్ కన్నే పేసుదడీ

-సరిత భూపతి
1/9/17