28, డిసెంబర్ 2016, బుధవారం

మోహోజ్వలిత

// మోహోజ్వలిత//

ఎన్నేసి పున్నములు నింపుకొని వదిలిన ఈ వాకిలికి ఇప్పుడిహ నీ కళ్ళను చూపిస్తాను
మరెన్నడూ అమావాస్యలు ఒడిసిపట్టలేనంత కాంతికి ఎన్ని ముత్యాల ముగ్గుల ముద్దులైతే చాలునూ!

నిశ్శబ్ధంలో సడి చేస్తున్న ఆ పెదవులకు కాస్త చెప్పవోయ్
మెడ వంపుల్లో నలిగిన ఊపిరంతా ప్రేమోజ్వలనమేనని!
ఆకాశపు వాకిట్లో అరవిరిసిన నెలవంకలనేమీ అడగబోను కానీ ప్యారా .. మనసు లోతుల్ని చుంబించే మల్లెలంటి నీ నవ్వుల్నో గుప్పెడు అరువియ్యవూ!

ఆనందాలంటే కొనుక్కోలేనివేమీ కాదు..
మనసుల్ని మోహించేస్తున్న కాలాన్ని ఉన్నపలంగా ఒకింత కొనెయ్యటమే కదూ!
నీ నవ్వుల్ని దోసిళ్ళలో ఒంపుకున్న కాలాన్నంతా ఎన్నెన్ని కలల్ని కన్న కళ్ళతో కొనెయ్యగలనూ?

యారా! మసక బారని రాత్రులని
గాలిబ్ గీతాల్ని విన్న పిల్లతెమ్మెరలు గోముగా తాకుతుండగా
మనసుని శృతి చేస్తున్న నీ మాటల్ని నిండు వెన్నెల సాక్షిగా మళ్ళీ మళ్ళీ ఇలాగే..ఇలాగే అడుగుతాను
ఈ క్షణాల్ని ఎప్పటికిలాగే బంధించేయవూ అని!

-సరిత భూపతి

29/12/16

7, డిసెంబర్ 2016, బుధవారం

నోస్టాల్జియా

//నోస్టాల్జియా//
ఖరీదు కట్టలేని క్షణాలెన్నో
తామరాకుపై నీటిబొట్లైపోతాయి
కరిగిన కాలమంతా ముగ్ధలా
ఆ మేఘాల్లో ముడుచుకొని ఉంటుంది
మరెప్పటికీ అందుకోలేకపోయినా
పదే పదే మనసుల్లో వర్షిస్తూనే
ఎంతకాలమైందో నువ్వలా వెన్నెల్లా నవ్వి
మళ్ళీ ఓసారి నవ్వవూ!
ఎప్పటిలాగే దోసిట్లో నీ నవ్వులను పేర్చుకొని
మరో నిశిని అందంగా వెలిగిస్తాను
వెలుతురు పిట్ట ఒకటి ఎందుకో ముభావంగా చూస్తూ ఉంది
దూరాన పడమటి కొండల్లో కాంతిపుంజం స్పృహ తప్పి పడిపోయింది
నువ్వు ఎదురుచూస్తున్న ప్రభాతం
నీకు మాత్రమే కొన్ని యుగాల దూరంలో ఆగిందేమో
ఎగిరిపోయిందెక్కడికో ఆ వెలుతురు పిట్ట
గోధూళిలో అలా కనుమరుగయ్యేంతవరకూ వెళ్ళింది

సరిత భూపతి 
7/12/16

6, నవంబర్ 2016, ఆదివారం

పూర్ణమదం పూర్ణమిదం

//  పూర్ణమదం పూర్ణమిదం //

శూన్యం నుంచే పుట్టి
శూన్యంలోనే కలిసిపోయే మస్తిష్కమెుకటి
రెండు గాజుకళ్ళేసుకొని
లోకాన్ని వెతుకుతుంటుంది

శూన్యంలో ఏముంటుందని దాన్ని అడగ్గలవా?
అనంత జగత్తు నిండి ఉన్నది శూన్యంలోనే అని
 ఎప్పటికో స్ఫురిస్తుంది దానికి

కటిక రాత్రుల నల్లటి నిశ్శబ్దాలనోసారి అడుగు
ఇంత ఏమీలేనితనాన్ని గుడ్డిగా మోస్తున్నదెందుకని
మరో ఉదయంలో ఇగిరిపోయి శూన్యమవటానికే అనదూ!

చిగురుటాకుల రెక్కలు పండి నిర్ధాక్షిణ్యంగా రాలిపడిపోతూ ఎందుకింకా నవ్వు
నీకిపుడు ఇంకేం  మిగిలిందన్నపుడు
శూన్యంలో పుట్టే మరో వసంతం
మరో శూన్యంలోకి తీస్కెళ్తున్నంత కాలం
ఈ నవ్వు చెదరదనే చెప్తుంది

ఏది ఎక్కడ మెుదలైనా
ఏది ఎక్కడ అంతమైనా
ఉన్నదొక్కటే శూన్యం
పూర్ణమదం పూర్ణమిదం

-సరిత భూపతి
18/7/16

మెన్(ఫ్ర)స్ట్రేషన్

// మెన్(ఫ్ర)స్ట్రేషన్ //

కొన్ని శుక్రకణాల కుప్పే
నీ పుట్టుకకు కారణమనుకుంటే
నువ్వు మూర్ఖుడివే మరి!

ఓ అంటరానితనపు అవయవం
ఇచ్చిన అమాయక బాలా!
మరి నీ పుట్టుకెలా పవిత్రం?

తినే తిండిని కూడా ఆమె స్పర్శే
అపవిత్రం చేయగలిగితే
నీ నరనరాల్లో నిండిన అమ్మతనపు రక్తమే
నిన్ను అపవిత్రం చేసిందని చచ్చిపో

తరతరాల అణచివేతలతో
అవమానభారం చీల్చేసిన
ఎండోమెట్రియంల రొద
మనిషితనం ఇంకా మిగులుంటే విను!

-సరిత భూపతి
21/7/16

5, నవంబర్ 2016, శనివారం

కల్లోలిత

//కల్లోలిత//

అదిగదిగో నిజంకాని కలలకే సిగ్గెక్కువ మరి
ఏమిటంత పిచ్చి ప్రేలాపన? కలలూ,నిజమున్నా?
కలలన్నీ ఊహలైతే ఆ ఊహంతా మరి నిజమే కదూ నీలవేణి

మంచుకొండల్లోంచి జారిపోతున్న నీటిబిందులేమీ ఏడవటం లేదు
మళ్ళీ ఘనీభవించటం నేర్చుకున్నాయి కాబోలు!
మరి పాత వాసనేస్తున్న జ్ఞాపకాల డైరీల్లో ఎండిపోయిన నీటిచారలు మాత్రం ఇలా ఎడారులుగానే మిగిలిపోవాలనుకుంటున్నాయేమో..

ఒక్కో సిప్పుకి ఇంకిపోతున్న కాఫీకప్పుల్లో
ఆప్టిమిసాన్ని వెతుక్కుంటూ కాయితాల్లో కలల్ని ఒంపుకోవటానికి కవినేమీ కాదోయి..
తుజ్సే కైసే సమ్జాన్..ఇస్ దిల్ కే జజ్బాత్ !
చిమ్మ చీకట్లలోన నిశ్శబ్దానికి సైతం కనబడకుండా
ఎన్నెన్నో కావ్యాలు లిఖిస్తూనే ఉన్నాయి మనసు కళ్ళు

అదిసరే..దిగులు దండాలను తెంచివేసే తుఫానులనేమీ
ఇపుడిక కోరుకోను కానీ ప్యారా
నాక్కొద్దిగా నవ్వటం నేర్పవూ!
అచ్చూ నీలా..ఆ పువ్వులా
రాలిపోతానన్న సంగతే తెలియక ఇంకా విచ్చుకోవాలనుకుంటున్న ఆ పసిమెుగ్గలా!

సరిత భూపతి
5/11/16

2, నవంబర్ 2016, బుధవారం

నిజమే నువ్వో విచిత్రమే

నిజమే నువ్వో విచిత్రమే!
అవును పైకి కనిపించని విచిత్రానివి
నువ్వు నవ్వుతావా అసలు?
నవ్వుతావేమో! మనుషుల్లో మంచితనం ఇంకొంత ఉందంటూ.. కొసరి వెతుకుతూ ఓ మందహాసం

నీ గొంతేమిటోయ్ మెరుపుతీగలాగా
ఛటుక్కున మనసులో మెదిలి అలా మాయమైపోతుంది
కొన్ని లిప్తల మౌనం తర్వాత " ఏం మాట్లాడవేం" అని అటు నుంచి నువ్వు..
అరెరె ఎంతకూ గుర్తురాదే ఆ స్వరం!
పోనీ..ఈసారొక పాట పాడవూ..!
కరుగుతున్న లిప్తలన్నీ కావ్యాలై మెరిసేదాక..
మనసుకు ఆవహించిన మౌనాన్ని శృతి చేసేదాక..
ఇక మరెన్నడూ ఆ స్వరం గుర్తురాలేకపోవటానికి
వీల్లేనంత తియ్యగా..

వయెులిన్ రాగమంత హాయైన నీ ప్రపంచంలో
ఇంకా లైఫ్ ఆఫ్ పై లలో
స్పిరిట్యువాలిటీని వెతుకుతున్నావా యారా!
ఓ నవ్వు..కొన్ని పుస్తకాలు.. కొంత జ్ఞానం..కొంత అణుకువ
ఇచ్చాయిగా..నీ జీవితానికో పరిపూర్ణత్వాన్ని.. 

21, అక్టోబర్ 2016, శుక్రవారం

స్వతంత్ర్యమా!!??

//స్వతంత్రమా !!!????//

క్షీరసముద్రరాజతనయా!
సకల లోకాలు పాలించే సిరి
నీ శ్రీవారి పాదాల కిందే పాన్పయిందని చింతించకు
మనుధర్మ గ్రంథాలను కాల్చి బూడిద చేసినా
మన మనసుల్లో పేరుకుపోయిన మనధర్మ సూత్రాలు ఇంకా వంటింటి గోడల చాటున పవిటలు అదిమిపెట్టిన పెదవుల దుఃఖాన్ని ఆపుతూనే ఉంటాయి చూడు

హయ్యో పిచ్చి ద్రౌపది!
ముక్కలు చేసి పంచుకోని పండును ప్రేమల ముసుగుల్లో
విలువల వలువలూడదీసే అవసరాల మయసభల్లో దయనీయ ధర్మరాజుల కథలివి
వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో
విధి వక్రించిన వయసులు
మనసు చంపుకోలేని మాస్టర్బేషన్లకి ఆరాధనలని పేరెట్టుకోనీ
సోకాల్డ్ స్వతంత్రమా నువ్వేం పట్టించుకోకు

అమాయక గాంధారుల కళ్ళకు
స్వేచ్ఛలనే గంతలు కట్టి
ఆదిపత్యపు బూటుకాళ్ళతో తన్నే
బాస్టర్డ్ బిడ్డల్ని కన్న భారత్ మా!
ఇపుడు విలపిస్తున్నావా?
చీకిపోయిన మైలగుడ్డల్ని ఉతుకుతూనో!
చిరిగిపోయిన యోనుల్ని కుడుతూనో!!

సరిత భూపతి
14/8/16

ముసుగులు

//ముసుగులు//

నువ్వు నవ్వుతావు..నేనూ నవ్వుతాను
నవ్వుల వెనకాల అరాచకాలు ఎన్నో
ఆరువందల ఎకరాల పొడుగునా
వికారపు మనసుల్లో రాజ్యాలేలుతాయి

చుట్టూ పెద్ద పెద్ద వ్యవస్థలను అల్లుకుంటాం
వాటిని పేరంటాల్లో పెద్దముత్తైదువలా అలంకరించి
చివరికి రెడ్లైట్ ఏరియాల్లో బేరాలు కుదురుస్తాం

ఎన్డ్ ఆఫ్ ద డే మన సెల్ఫ్ సెంటర్డ్ బతుకులకి
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ .. "అవసరమే" అని తెలిసేటప్పటికి
ముసుగులన్నీ వెకిలిగా నవ్వుతాయి
నువ్వు నీలా బతకటం ఇంకెపుడూ అని

-సరిత భూపతి
17/8/16

తామసి

// తామసి//

అలసట చెందిన మనసు
పాండమోనియం రణగొణల్లో నలిగిపోతున్నపుడు
సాంత్వననిచ్చేది మాండలిన్ స్వరాన్ని మోసుకొస్తున్న
చిన్న గాలితెమ్మెరలా తాకే నీ ఊహలు మాత్రమే

తామసీ! గుడ్డి దీపాల పైన అమావాస్య వర్ణపు చెంపలకు
ఇపుడిక వెన్నెల జిలుగులు అద్దలేను కానీ
నాతోపాటు ఇలాగే విహరించవూ
నిశినే వణికించే నిశ్శబ్ధంగానో
నడిరాత్రికి గంతలు విప్పుతూ మిణుగురుగానో

కళ్ళ ముందు ఇప్పటికిప్పుడూ,ఎప్పటికీ
కలగంటున్న నిజాలన్నీ అమీబాల ఆకృతులే అనీ
తెలుసుకుంటున్నపుడు బిగ్గరగా నవ్వోసారి
నువ్వు నీలా ఇంకా మిగిలే ఉన్నందుకు
క్యాటర్పిల్లర్స్కి సహనం నేర్పుతూనో
కాళిందిలో విజృంభిస్తూనో!

-సరిత భూపతి
30/8/16

బర్సాత్ ప్యార్ కీ ఆసున్

// బర్సాత్ ప్యార్ కీ ఆసున్ //

రెప్పల మాటున ఉబికిన కన్నీటి కాన్వాసులపై
కాలపు మునివేళ్ళతో
బతుకు చిత్రమెుకటి దిద్దుతున్నావా ప్రియే!
తడితడిగా ముక్కలైన గుండెల అవశేషాల్ని
ఏ వాటర్ప్రూఫ్ ప్లాస్టర్ మాత్రం అతికించగలదనీ వృథాప్రయాస?

జాన్ సే ప్యారా! నాలుగు చినుకుల్ని దాచేసుకున్న మ్రాను
మోడై అసంపూర్ణతకే ఎక్కువ విలపిస్తుందక్కడ విన్నావా?
అయినా సరే ఇంకొంత మిగిలుందాం
మట్టి పరిమళాలకు నిర్వేదంగా ఆశపడుతూ
మనమూ ఇపుడొకింత విలపిద్దాం ప్రేమికా!
బాహే గలే మే డాల్ కే హమ్ రో లే జార్ జార్

సాగరమంత ఘోషలో కెరటమై ఎగిసిపడాలన్న ఆరాటమేమీ లేదిపుడు..
ప్రేమశంఖువులో గుక్కెడు ఉప్పునీరు నిండనీ
చల్లుకుందాం అప్పుడు హుషారుగా
బర్సాత్ ప్యార్ కీ ఆసున్ చిప్పిల్లనీ కళ్ళవెంబటా
రెండూ కలిసిపోయేలా
ఇప్పుడు చెప్పూ.. కడలి అంత ఉప్పనీరు దాచుకున్నా ఉప్పొంగట్లేదూ! అచ్చూ మన మనసుల్లా!

సరిత భూపతి
7/9/16

నైనం చిన్దన్తి శస్ర్తాణి

//నైనం చిన్దన్తి శస్త్రాణి//

తెల్లకాగితాల్లో ఇంకు.. ఉండలు చుట్టిన జీవితాన్ని
రోజొకింత ఒంపుకోవటం చూశావా?
ఏముందా రాతల్లో!?
తలగడల సాక్ష్యాలైన తడి ఆరని గాథలో
ఫాంటస్సీలై మెరిసిన విబ్జియార్ రంగుల కలలో

కటిక చీకట్లేనాడు కలగనని గతపు పొదలో
ఒక నవ్వు భళ్ళున పగిలిన శబ్ధం
హయ్యో! ఒట్టి పనికిమాలిన ఘోష ఇది అని
ఎన్నెన్ని నిశీధులు వెర్రిగా చూసెళ్ళిపోయాయో మరి!

గగనవియత్శూన్యాలకు పయనించే ఓ మనిషీ!
ఎన్నెన్ని చూస్తావో ఈ లోకంలో
కానీ నువ్వివాళ పోతే రేపటికి రెండట!
ఎంతెంత వేదాంతం..
నువ్వు విరబూసినా విలపించినా చీలిపోని ఆత్మకి
ఏ సంఖ్యాశాస్త్రాలతో లెక్కలు అప్పజెప్పగలవు మరి!
ఒట్టి వృథాప్రయాసే కదూ!
ఆత్మను ఏ ఆయుధం చీల్చలేదు.. అవును
నైనం చిన్దన్తి శస్త్రాణి
నైనం దహతి పావకః

సరిత భూపతి
3/10/16