6, నవంబర్ 2016, ఆదివారం

పూర్ణమదం పూర్ణమిదం

//  పూర్ణమదం పూర్ణమిదం //

శూన్యం నుంచే పుట్టి
శూన్యంలోనే కలిసిపోయే మస్తిష్కమెుకటి
రెండు గాజుకళ్ళేసుకొని
లోకాన్ని వెతుకుతుంటుంది

శూన్యంలో ఏముంటుందని దాన్ని అడగ్గలవా?
అనంత జగత్తు నిండి ఉన్నది శూన్యంలోనే అని
 ఎప్పటికో స్ఫురిస్తుంది దానికి

కటిక రాత్రుల నల్లటి నిశ్శబ్దాలనోసారి అడుగు
ఇంత ఏమీలేనితనాన్ని గుడ్డిగా మోస్తున్నదెందుకని
మరో ఉదయంలో ఇగిరిపోయి శూన్యమవటానికే అనదూ!

చిగురుటాకుల రెక్కలు పండి నిర్ధాక్షిణ్యంగా రాలిపడిపోతూ ఎందుకింకా నవ్వు
నీకిపుడు ఇంకేం  మిగిలిందన్నపుడు
శూన్యంలో పుట్టే మరో వసంతం
మరో శూన్యంలోకి తీస్కెళ్తున్నంత కాలం
ఈ నవ్వు చెదరదనే చెప్తుంది

ఏది ఎక్కడ మెుదలైనా
ఏది ఎక్కడ అంతమైనా
ఉన్నదొక్కటే శూన్యం
పూర్ణమదం పూర్ణమిదం

-సరిత భూపతి
18/7/16

మెన్(ఫ్ర)స్ట్రేషన్

// మెన్(ఫ్ర)స్ట్రేషన్ //

కొన్ని శుక్రకణాల కుప్పే
నీ పుట్టుకకు కారణమనుకుంటే
నువ్వు మూర్ఖుడివే మరి!

ఓ అంటరానితనపు అవయవం
ఇచ్చిన అమాయక బాలా!
మరి నీ పుట్టుకెలా పవిత్రం?

తినే తిండిని కూడా ఆమె స్పర్శే
అపవిత్రం చేయగలిగితే
నీ నరనరాల్లో నిండిన అమ్మతనపు రక్తమే
నిన్ను అపవిత్రం చేసిందని చచ్చిపో

తరతరాల అణచివేతలతో
అవమానభారం చీల్చేసిన
ఎండోమెట్రియంల రొద
మనిషితనం ఇంకా మిగులుంటే విను!

-సరిత భూపతి
21/7/16

5, నవంబర్ 2016, శనివారం

కల్లోలిత

//కల్లోలిత//

అదిగదిగో నిజంకాని కలలకే సిగ్గెక్కువ మరి
ఏమిటంత పిచ్చి ప్రేలాపన? కలలూ,నిజమున్నా?
కలలన్నీ ఊహలైతే ఆ ఊహంతా మరి నిజమే కదూ నీలవేణి

మంచుకొండల్లోంచి జారిపోతున్న నీటిబిందులేమీ ఏడవటం లేదు
మళ్ళీ ఘనీభవించటం నేర్చుకున్నాయి కాబోలు!
మరి పాత వాసనేస్తున్న జ్ఞాపకాల డైరీల్లో ఎండిపోయిన నీటిచారలు మాత్రం ఇలా ఎడారులుగానే మిగిలిపోవాలనుకుంటున్నాయేమో..

ఒక్కో సిప్పుకి ఇంకిపోతున్న కాఫీకప్పుల్లో
ఆప్టిమిసాన్ని వెతుక్కుంటూ కాయితాల్లో కలల్ని ఒంపుకోవటానికి కవినేమీ కాదోయి..
తుజ్సే కైసే సమ్జాన్..ఇస్ దిల్ కే జజ్బాత్ !
చిమ్మ చీకట్లలోన నిశ్శబ్దానికి సైతం కనబడకుండా
ఎన్నెన్నో కావ్యాలు లిఖిస్తూనే ఉన్నాయి మనసు కళ్ళు

అదిసరే..దిగులు దండాలను తెంచివేసే తుఫానులనేమీ
ఇపుడిక కోరుకోను కానీ ప్యారా
నాక్కొద్దిగా నవ్వటం నేర్పవూ!
అచ్చూ నీలా..ఆ పువ్వులా
రాలిపోతానన్న సంగతే తెలియక ఇంకా విచ్చుకోవాలనుకుంటున్న ఆ పసిమెుగ్గలా!

సరిత భూపతి
5/11/16

2, నవంబర్ 2016, బుధవారం

నిజమే నువ్వో విచిత్రమే

నిజమే నువ్వో విచిత్రమే!
అవును పైకి కనిపించని విచిత్రానివి
నువ్వు నవ్వుతావా అసలు?
నవ్వుతావేమో! మనుషుల్లో మంచితనం ఇంకొంత ఉందంటూ.. కొసరి వెతుకుతూ ఓ మందహాసం

నీ గొంతేమిటోయ్ మెరుపుతీగలాగా
ఛటుక్కున మనసులో మెదిలి అలా మాయమైపోతుంది
కొన్ని లిప్తల మౌనం తర్వాత " ఏం మాట్లాడవేం" అని అటు నుంచి నువ్వు..
అరెరె ఎంతకూ గుర్తురాదే ఆ స్వరం!
పోనీ..ఈసారొక పాట పాడవూ..!
కరుగుతున్న లిప్తలన్నీ కావ్యాలై మెరిసేదాక..
మనసుకు ఆవహించిన మౌనాన్ని శృతి చేసేదాక..
ఇక మరెన్నడూ ఆ స్వరం గుర్తురాలేకపోవటానికి
వీల్లేనంత తియ్యగా..

వయెులిన్ రాగమంత హాయైన నీ ప్రపంచంలో
ఇంకా లైఫ్ ఆఫ్ పై లలో
స్పిరిట్యువాలిటీని వెతుకుతున్నావా యారా!
ఓ నవ్వు..కొన్ని పుస్తకాలు.. కొంత జ్ఞానం..కొంత అణుకువ
ఇచ్చాయిగా..నీ జీవితానికో పరిపూర్ణత్వాన్ని..