26, జులై 2017, బుధవారం

మబ్బు గుర్తులు

// మబ్బు గుర్తులు //

ఒక్కోసారి ఆకాశం దోసిట్లో దూకి, అరచేతుల్లో ముద్దిచ్చి పోతుంది
ఎప్పటికీ ఉండిపొమ్మని అడుగుతాను
నువ్వు అవనివై ఉండగా నేనెలా వదిలిపోగలనని ఆ మొక్కల మోముల్లో కురిసి వొదిగిపోతుంది
తన రాల్చిన గుర్తులు పువ్వుల్లోంచి నా నవ్వులుగా వొంపుకుంటాను
ఆ క్షణం విరహాన్నీ ప్రేమిస్తాను
నీ చినుకుల కబుర్లు
నువ్వెళ్ళాక నీ గురుతుల గుసగుసలు
నాకు నేను అందనంత దగ్గరగా నన్ను చుట్టేస్తాయి
అవును..చేరువైనా, దూరమైనా ఆనందమే !
కప్పు కాఫీతో నిన్నూహిస్తూ పాడుకుంటాను

నిన్ను ఇచ్చేయమని అడుగుతాను
నన్ను శూన్యం చేసి, నీలో నన్ను కొత్తగా చూపుతావు

-సరిత భూపతి
27/7/17

7, జులై 2017, శుక్రవారం

ఫికర్ మత్ కరో భాయ్

ఇక్కడ ప్రతివాడూ స్వలాభం కొరకే
'స్వేచ్ఛంటే నువ్విచ్చేది కాదు
నేను తీసుకోగలిగేది' అని ఆమె అరవలేదెందుకో!
లోకంలో నిర్భయలంతా ఇపుడు కాఫీ బ్రేక్ న్యూస్ లు అయిపోతారు
కఠినపు ఛేష్టలు చూసీ చూడనట్టు సమాజం, కళ్ళు మూసుకొని కటోపనిషత్తు చదువుకుంటూ ఉంటుంది

ధర్మేత్వయా ఏషా నాతిచరితవ్య బాసల్లో ధర్మం, ఆనాడే పాతివ్రత్యం నిరూపించుకోలేక మంటల్లో కాలిపోతుంది
ఇపుడు పడతులంతా కిరోసిన్ మంటల్లో పవిత్రులైపోతారు

బొట్లు,కుంకుమలు ఆడదాని పిట్యూటరీ గ్లాండ్ల జన్మ హక్కన్నట్టు, ప్రభుత్వం పన్ను లేకుండానే మెుహాన కొడుతుంది.కానీ,
చీకిపోయిన మైలగుడ్డల ఏడుపులు గ్రామాల్లో బడిదాకా పోనియ్యవు చూడు
ఫికర్ మత్ కరో భాయ్, ప్రభుత్వం ఆదాయం చేసుకుంటుంది
ఎంతైనా, నాప్కిన్ల కోసం Menstrual system నిరసన చేయలేదు కదూ!

టోర్న్ బట్టలు ఫ్యాషన్ చేసి, ఒంటి మీద నుంచి పెట్టికోట్ కనపడితే మిర్రున చూసే లోకంలో FreeTheNipple compaign లను చూసి ఇపుడు నవ్వాలో, ఏడవాలో!!

నిజమేరా, కల కన్నవాడు లేకపోయినా వాడి కల బతికేఉంటుంది
నీతులు లిఖించిన మనువు ఇపుడు లేకుంటే ఏం? అడుగడుగునా 'మనువు'లే.
ఫికర్ మత్ కరో భాయ్
వినేవాడికే విలువలు

-సరిత భూపతి
1/7/17