26, ఫిబ్రవరి 2017, ఆదివారం

వెన్నీల అలక

// వెన్నీల అలక //

ప్రతీరాత్రిలాగే కొన్ని కబుర్లలా చెక్కి ఉంచాను
వెన్నెల అలిగింది వినటానికి రాలేదు
నీ నవ్వులు కొంచెం దాని బుగ్గన పూసేస్తాను
ఇక మరెప్పుడూ చిన్నబోనంతగా అదీ నవ్వేస్తుంది

నిన్ను వినిపించినపుడల్లా చీకటి దారుల్లో నడుస్తూ
నీకోసం వెతుక్కుంటూ ఉంటుంది
నీకో వెలుతురు గీతం చూపించాలనే నా కబురు
నీ వరకూ మోసుకొచ్చి గుప్పెడు కలువల్ని
నీ కన్నుల వాకిళ్ళలో పేర్చి
ఇక ఎక్కడికో పోతుంది నా నిద్రలో కలైపోతుంది
మళ్ళీ ఎపుడొస్తావని నేను అడగను
అడగకపోయినా ఆత్రంగా వొచ్చేస్తుంది
నిన్ను చూడ్డం దానికంతిష్టం,  అంతే అసూయ మరి

నువ్వు నవ్వటం వెన్నెలకన్నా హాయిగా ఉంటుందన్నపుడు
దానిక్కానీ వినపడిందేమో
మచ్చలేని చంద్రుని నవ్వు హయే మరి
అని అలిగి వెళ్ళిపోయింది
ఈ వేళ రానేలేదు

-సరిత భూపతి
26/2/17

22, ఫిబ్రవరి 2017, బుధవారం

A Night in the snow

A Night in the snow

అరమోడ్పు కళ్ళల్లో నలిగి
గారాలు పోతున్న గులాబీ రెక్కల దేహం
మెడ వంపున దారి తప్పిన అధరానికి తోడుగా
వెచ్చని ఊపిర్లలో బంధీలయిన
నైట్ క్వీన్ పరిమళం

కడలి కెరటాలను మోసుకొచ్చి
పాదాలను ముద్దాడించలేనేమో కానీ
నువ్వు నవ్విన ప్రతీసారి నదినై
ఆ కళ్ళల్లో దాగిపోయి ఓ గుల్జార్ కావ్యాన్ని
గాలితో కబురంపలేనూ కనీసం!
ప్యారా..నీలో ఒదిగిపోవటం కంటే
ఇపుడిక గొప్పగా మరింకేమీ లేదు
నదియే నీయానాళ్ కడలే నానే
సిరు పరవై నీయానాళ్ ఉన్ వానమ్ నానే

ఈ రాత్రి వెన్నెలతో ఏకాంతంగా
చుక్కల్ని దిద్దుతోంది
మబ్బు తుణకలు సిగ్గుపడుతోన్న చప్పుడు
నువ్వు గానీ నవ్వావా? వెన్నీలంతా ఒళ్ళో దూకేసింది
పరవశించిన నిశి దేహపు తన్మయత్వానికి సాక్ష్యాలేమో
మలిపొద్దున పువ్వులపై మెరుస్తున్న మంచు బిందువులు
ఇహ నువ్వు నాకు నేను నీకూ మిగిలిపోవటం
ఎంత బావుందో కదూ!
మరి నాతో అలా వచ్చేద్దూ..
ధడ్కనోన్ కే పాస్ మే
హన్ పాస్ మే ఘర్ జనాయే
హయే భూల్ యా జహాన్


-సరిత భూపతి
23/2/17 

20, ఫిబ్రవరి 2017, సోమవారం

A Dark song

// A Dark song //

పడమటి దారులెంత దూరంగా ఉంటాయో తెలుసా
ఎప్పటికీ అందుకోవాలనిపించనంత దూరంగా
వెళితే తిరిగి రావాలనిపించనంత దూరంగా
ఉషోదయాల్ని కోరుకోవటం మాత్రమే బావుంటుంది
ఆ కోరుకోవటం మానేసాక గుడ్డిదీపాల్ని వెలిగించటం మరెవరూ నేర్పరు..అసలక్కర్లేదేమో

పైరగాలి పెదవంచున నిశ్శబ్ధాలు
తీరం లేని కాలినడకలు
మన్ను తాకిన మిన్నుల్లో కాయితప్పడవలు
ఇక మరెన్ని నోస్టాల్జియాలు
నిన్ను మాత్రమే మిగిల్చినపుడు
నవ్వుకో ఏడుపుకో కాసేపు నిన్ను నువ్వు అరువిచ్చేసి
మళ్ళీ తిరిగొచ్చెయ్
శూన్యం మాత్రమే దోసిట్లో ఒలకబోస్తున్న దారుల్లోకి
అసలేమీ వినిపించనంత ఇంకేమీ కనిపించనంత నీలోకి
ప్రేమించబడాలనే ఆశలేమీ లేనపుడు
ప్రేమించటం మాత్రమే నేర్చుకున్న నీలోకి

-సరిత భూపతి
21/2/17

అదంతే

// అదంతే //

ఆకాశపు రంగు నిద్రల్లో
అలసిపోయిన చుక్కల కల
ధ్వంసమవుతున్న ప్రతీసారి
ఇలలో కూలిపోతున్న మబ్బు కళ్ళ దుఃఖాలు
అచ్చూ ప్రతీ రాత్రిలానే

కాలం అంతే..అలాగే ఉంటుంది
ఒకనాటి మల్లెల నవ్వులు
నీకిపుడు నవ్వుగానే తోచదు
గగనపు కొనల్లో రెక్కలు కట్టుకొని
కనుచూపు మేరల్లో విహరిస్తున్న
బుల్లిపిట్టను చూసినా ఇపుడు నీకెందుకో అసూయే మరి!

వచ్చి వెళ్ళిపోయిన దారుల్లో
తిరిగి మళ్ళీ మళ్ళీ నడవటం అంటే
జ్ఞాపకాల్ని ఒంపుకోవటమే కాదా!?
దూరాల్ని కొలవటం బాధే మరి
మానుకోరాదూ

అపుడే పురుడు పోసుకుంటున్న
సొంతగూటి పిట్ట ఎగరాలనుకోవటమూ
నీకు స్వార్థపు వాసనేసినపుడు
ఇక మరేదీ ఇష్టంగానే తోచదు
పువ్వు నవ్వాలనుకోవటం
నువ్వు నవ్వాలనుకోవటం కూడా

-సరిత భూపతి

20/2/17

9, ఫిబ్రవరి 2017, గురువారం

మరీచిక

// మరీచిక //

ప్యారా!
ఎన్ని పదాలు అల్లినా అది నువ్వవలేనపుడు అసలింకెలా చెప్పగలను?
కానీ నీకిపుడు చెప్పాలి
కాస్త నిశ్శబ్ధాన్ని కూడా వినగలిగినపుడు
ఏమీ చెప్పలేనితనాన్ని కూడా కొన్నిసార్లు చదవాలి
దిగులుగా శూన్యంలో నడుచుకుంటూ ఉంటాను
కీచురాళ్ళు భయపడుతున్న మూలుగు
చీకట్లు ఉళిక్కిపడేంత నలుపు
వణికిపోతున్న గుండెపుడో స్పందించటం మానేసింది
దారే తెలియని దారిలో దారి తప్పిపోయాను
ఎక్కడ్నుంచి వచ్చిందో కళ్ళు పొడుచుకెళ్ళేంత ప్రకాశవంతంగా ఒక కాంతిపుంజం
నా వెనకాలే వెతికి పట్టుకున్నట్టుగా ఓ మరీచిక
ఆశ్చర్యకరంగా అది నువ్వే..
బతకటం ఎలా బావుంటుందో
నువ్వే చెప్పాలి..నువ్వు మాత్రమే
పగిలిపోయిన నీటిచారలు
ముభావంగా ఆకాశంకేసి చూస్తున్నపుడు
పెట్రికోర్ సువాసనల్లా సాంత్వననిస్తూ నీ మాటలు
నువ్వొచ్చావని చెప్పనా...వానొచ్చిందనా?
అలా స్వాతివానలో కాసేపు ఒలికిపోతాను
నువ్వుండటం ఎంత బావుంటుందో తెలుసా
కాదు..అసలు నువ్వున్నావనే ఊహే ఎంత బావుంటుందో తెలుసా!
అమ్మ లాలిపాట ఇంకా వింటున్నాననే భ్రమలోనే
ఆదమరిచి నిదిరిస్తున్న పాపాయి మోములా

-సరిత భూపతి
9/2/17


ఒంటరితనం

//ఒంటరితనం//

చిమ్ము చీకటి లేదు
కారడవి కాదు
కళ్ళు పొడుచుకున్నా కనపడని గుడ్డితనమూ లేదు
ఉన్నదంతా గుండెల నిండా పేరుకుపోయిన
నిర్వికారం..నిశ్చేష్టం

మనుషులు కనపడని ఎడారిలో లేను
పాదం కందనివ్వని రెడ్ కార్పెట్ అడుగులో
నాలుగు అద్దాల గోడలు గాజు కళ్ళేసుకొని
వెక్కిరిస్తున్న అలజడో
గట్టిగా కుదిపివేస్తూ ఆవరించిన ఒంటరితనం

నా ఊపిరి నాకే
చెవుల్నిండా పేరుకుపోయి
నిశ్శబ్ధం చేస్తున్న భయంకర శబ్ధం
భరించలేని ఒంటరితనం

ఆలోచనల కుప్పలన్నీ
అవశేషాలై మిగిలిపోతుంటే
పిచ్చెక్కినట్టు అరవాలనిపించే ఒంటరితనం
ఒంటరితనం బాధో, వరమో
మరెవర్నీ అడగాలనిపించని ఒంటరితనం

-సరిత భూపతి
15/7/16

జిందగీ

//జిందగీ//

దూరంగా ఓ తీతువు పిట్ట నవ్వింది
బతికున్నందుకు పోరాటమా
మరణం కోసం ఆరాటమా అర్థంకాని నవ్వు

బండరాళ్ళ నడుమ అమాయకంగా జారి
మరో దారిని వెతుక్కుంటూ ఎక్కడో
అంతర్థాన మైపోతున్న నీటిపాయ

ఆకుపచ్చ చీరలంతా నెరసిపోతున్నా
బంగారమని మురిసే మాగాణి పిల్లగాలులు

దూరంగా మళ్ళీ అదే నవ్వు
అదే తీతువు పిట్ట
పడమటి కొండల మీద దూరంగా పయనిస్తూ
జీనా యా మర్నా ఇన్ దోనే మే
కీసీ ఏక్ జిందగీ పరిభాషిత్ కర్నా
బహుషా ఇదేనేమో ఆ నవ్వుకు అర్థం

సరిత భూపతి
2/7/16

5, ఫిబ్రవరి 2017, ఆదివారం

// కాఫీ కా కహానీ //

విను..
కుప్పలుగా పేరుకుపోయిన గతాలన్నీ
నిన్నటికి సాక్ష్యాలు మాత్రమే
రేపటి పురోగమనాలు చూసి నవ్వనీ..
మరలి రాకు గతమా
మధురమైన వేళ
గడిచిపోయినవే బావుంటాయా?
కొన్ని బాధగా కూడానేమో!

నిశ్శబ్ధాన్ని కళ్ళు మూసుకొని
మనసుతో వెతుక్కుంటున్న రాత్రుళ్ళు
అపుడే ఆవలిస్తూ చీకటి
మంచుపొగలకు పోటీలుగా కాఫీ సెగలు
సిప్పు సిప్పుకి మనసును
స్పృశిస్తున్న కహానీలు
దూరంగా ఏదో శబ్ధం
బహుషా నీ తలపొకటి నవ్విందేమో!

సరిత భూపతి
5/2/17

4, ఫిబ్రవరి 2017, శనివారం

తక్షణం ఇపుడొక కిరణజన్యసంయోగక్రియనై
నెలుంబోన్యూసిఫెరాల జననానికో కేంద్రమవ్వాలి
అవును..నీ నవ్వో కలువైతే ఫోటోసింథసిస్ లకి వెలుగంతా నీ దోసిళ్ళలో ఒంపి
క్లోరోఫిల్ ని అయిపోవటం నాకిపుడు నేర్పవా ముందు

ఓ లోలకమై నీ మనసు గదిలో పచార్లు చేస్తున్నపుడు
ఆంప్లిట్యూడ్ ని కొలవటం మాని ఆట్టిట్యూడ్ ని తెలుసుకోవటం
నువ్వూ ఇపుడు తక్షణం నేర్చుకోవలసిన విద్యే మరి!

జీవితం ఒక శూన్యబిందువైతే
నువ్వూ నేనూ sin(theta)+cos(theta) లమై కలిసిపోయే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఒకటి కావాల్సిందే మరి!

2, ఫిబ్రవరి 2017, గురువారం

హైబర్నేషన్

// హైబర్నేషన్ //

కళ్ళు తెరిచి కకూన్లలో పొదువుకుంటూ
ఇంకా ఎగరలేమేమని దిగులా
మనం పట్టిన కుందేలుకు
కాళ్ళెపుడూ మూడే కదూ కూపస్థ మండుకా!

రక్షణో శిక్షో తెలియదు కానీ
ఇపుడిది చేయాలి ఇది చేయకూడదంతే..
రూలేమిటో తెలియని రూత్లెస్ గొర్రెలం
రామా కనవేమిరా!

కమనీయ ముసుగుల మాటున
కర్కషపు పాదాల తొక్కళ్లలో
కలలెన్ని నలిగాయో కనికరములేదే
డీమస్క్  పెర్ఫ్యూమ్లు నాభిన దాచుకొని
పరిమళించలేని డిటాచ్డ్ జిందగీలో
మెర్సీలెస్ మయసభలు
కళ్ళు తెరువు గాంధారి..ఇంకొంత నవ్వేవూ!

సరిత భూపతి
2/2/17

1, ఫిబ్రవరి 2017, బుధవారం

ప్రశాంతత

// ప్రశాంతత//

ఏ బాదరా బందీలేని కొన్ని మౌనాలు కావాలిప్పుడు
ఆడంబరాలన్నీ శూన్యమైన నిశ్శబ్ధం కొద్దిగా కావాలిప్పుడు
మనసులో నిక్షిప్తమై ఒత్తిడి పెంచుతున్న పనుల చిట్టా టెంపరరీగా రిమూవ్ అయిపోవాలిపుడు

ఎంత యాంత్రికమైపోయాం మనం
ఉదయం పూట లీలగా వచ్చి పలకరిస్తున్న పిల్లగాలిని
గాబరాగా సింక్ నీళ్ళతో స్నానం చేస్తున్న వేడి పప్పు కుక్కర్ ఎప్పుడూ డామినేట్ చేస్తూ ఉంటుంది

ఆఫీస్ నుంచి వస్తూ బురదలో ఆనందంగా ఎగురుతున్న పిల్లల్ని చూసి ఏం కోల్పోతున్నామో గ్రహించే లోపే
చీకటి పడితే బస్ మిస్సయిపోతామన్న భయం తొందరపెడుతుంది

ఇన్ని గంధరగోళాల తర్వాత మళ్ళీ ఉదయన్నే మేల్కోవాలనే గుబులు
శిథిలావస్థలో ఉన్న పాత టేప్ రికార్డర్ మూలుగును నొక్కపెట్టేస్తుంది

రోజంతా గజిబిజిగా విలవిల్లాడుతున్న మనసుకు
కొంత ప్రశాంతత కావాలిపిడు
ఒక నిశ్శబ్ధ శబ్ధాన్ని గుండెల నిండా నింపుకోవాలనుందిపుడు