17, జనవరి 2018, బుధవారం

Transparency

Transparency:

నీ కథ, నా కథ..  వాడూ, వీడూ అందరి కథలన్నీ, శూన్యాల చుట్టలుచుట్టుకుపోతుంటాయి
నెవరెండింగ్ ఎమ్టీనెస్ లను కాల్చలేని భోగిమంటలు
కొలనిదోపరికి గొబ్బిళ్లో.. క్రియేటివిటీ కట్టేసిన వాకిళ్లో
ఫరెవర్ స్వేచ్ఛల లుక్కులిచ్చేసి, దారాలకు బంధీలయిన గాలిపటాలం.. అలా ఎగురుతుంటాం
నీ నుంచి నీలోకి దాటుతున్న పారదర్శకత్వంలో
వెతుక్కున్న నిన్నో, కోల్పోతున్న నిన్నో..మిగిలేదైతే నువ్వే. జీరో ఇన్ టూ ఎనీథింగ్ ఈక్వల్స్ టూ జీరో
పూర్ణ మదః పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతి..మరి, నీకు నువ్వే గతి
నేర్చుకో, ఇదం నేర్పుతున్న ఈశావాస్యోపనిషత్తులు
కాలంతో జారిపోతున్న కన్నింగ్ స్క్రిప్ట్ లకు
లైఫో కామెడీ స్కిట్
ఫికర్ మత్, లాఫ్ ఎట్ యువర్ పెయిన్
బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్
ఇరుకున పడుతుండటమే ఇహం అని గుర్తించు, ఇందీవరాక్షా!
ఇహ పాడుకో..సాగిపో
తప్పటడుగో, తప్పు అడుగో..తప్పదే! తప్పుకుపోదాం,తక్షణం !!

-సరిత భూపతి
17-01-18

5, జనవరి 2018, శుక్రవారం

నీ తలపులలో...

మబ్బుల్లో దాగుడుమూతలాడుతున్న చంద్రుడిలా నువ్వు
అమావాస్య ముసుగుల్లో నీ కోసం వెతుకుతూ నేను
తెరలుతెరలుగా దిగివస్తూ, నువ్వేనా..? నా నువ్వేనా...!
తొలి చూపుల సంశయం..
ఇంతలోనే మెదడుకో వెలుతురు రేఖ
నీవు వచ్చేవని..నీ పిలుపే విని..
పలకరింపులూ మరచి, చూస్తుండిపోయానా? ఏమో!!

నా కలవరింతల్లోని నిన్ను దాటి, తిరగి నీ దగ్గరికి తీసుకురావటానికీ, మళ్ళీ అది నువ్వే అయ్యుండాలి
నన్ను నిదుర లేపటం నీకు కొత్తేమీ కాదుగా
నన్ను ఇహానికి లాక్కొచ్చిన నీ స్పర్శే మెత్తని సూదిలా, ఓ సుప్రభాతం
నీ పక్కన నిలుచున్నానా? గాలిలో తేలానా??

నాకు చదవటం ఎప్పటికీ ఆపబుద్ధేయని, నాలుగు కళ్ళ చూపు
చూపేనా ?.. విరితూపేనా..!?
ఆ నవ్వెంత స్వచ్ఛం!
నువ్వెంత సౌమ్యం!!
అరచేతుల సిగ్గులకు , నువ్వో ఎర్రటి చుంబనం
పంచుకున్న చాక్లెట్ ముద్దులో
రెండు కపోతాల కౌగలింతల కావ్యం
ఇవాల్టిక ఆఖరు మరి.. అనాలనిపించని క్షణాల్లో,
ఈసడించుకుంటున్న కాలమెుక దిష్టిచుక్క

నిన్నెన్నిసార్లు చూసినా, అది అసంకల్పిత ప్రతీకారచర్యంత యాధృచ్ఛికం, నవీనం ..

ఆ ఎండలు, నీ నీడలూ..
బుుతువులన్ని నాకిచ్చేసిన, నీకేమిచ్చుకోనూ!?
కనులే నావి..కలలన్నీ నీవేగా!
ఘడియయేని, ఇక విడిచిపోకుమా, మెలకువలోనైనా... ❤