19, అక్టోబర్ 2017, గురువారం

చీకటి

// చీకటి //

తిమిరాన్నంతా తన వద్దే దాచేసుకొని
ప్రపంచానికి వెలుగులా చూపుకుంటున్న దీపం గురించి ఇపుడేం చెప్పనూ?

కొన్ని చీకట్లను ఎవరూ గుర్తించలేరు
నలుపులు పులుముకుంటున్న పర్వర్టెడ్ అథారిటీలకు
లోలోపలి తిమిరాన్ని ఎప్పటికీ వెలిగించలేనని
చూపాలనిపించుకోని సహజత్వం

వెలిగే దీపాల్లా కనిపించే నవ్వులన్నీ
నువ్వు చూడగలిగేవి మాత్రమే,
తన లోపలి చీకట్ల ప్రతిబింబాలే

చిమ్ము చీకటిలో లోకానికి వెలుగైన
ఓ గుడ్డిదీపపు లోపటి నలుపు
బయట మతాబుల శబ్ధానికి ఓసారి ఉలిక్కిపడింది
అవును, కొన్నిసార్లంతే..
      కొందరి ఆనందమూ, కొందరికి చివుక్కుమనేలా చేస్తుంది
అంధకారం లోకంలో కాదు
నీ లోపల అని అమావాస్య రాత్రి వెక్కిరించిపోతుంది

-సరిత భూపతి
19.10.17

9, అక్టోబర్ 2017, సోమవారం

patterns

// patterns //

రాలిపోతున్న ఉదయాలనో
వాడిపోతున్న పూలనో తలుచుకొని
ఒక సాయంత్రం కుమిలిపోతూ వుంటుంది
వేకువల కోసం ఆలోచించలేని కళ్ళు
మోడైపోయిన చెట్ల కింద
ఆకులు విడిచిన ముద్రలకు ఇపుడెక్కువగా విలపిస్తాయి
సరిగ్గా అపుడనుకుంటాను
నాతో లేవన్న విరహాల కంటే
నాలో వున్న జ్ఞాపకాల సాంద్రత ఎక్కువ కదూ అని !
అవును.. నువ్వు రాలేవన్న నిజం కంటే
నీ ఊసుల సజీవత్వమెప్పటికీ ఎనలేని సంతోషం

ప్రేమించబడాలనే ఆశలు లేని
డిటాచ్డ్ అటాచ్మెంటో విడువని తృప్తి
ఆజ్ రుస్వా తేరి గలియోఁమే మెుహాబ్బత్ హోగీ
అని శాపనార్థమేమీ పాడలేను కానీ
నువు రాక ముందు జీవితం గురుతైనా లేని
ఈ క్షణమెంతో హాయి

-సరిత భూపతి
9/11/17