20, జనవరి 2017, శుక్రవారం

సుశుప్త

// సుశుప్త //

మసిపట్టిన నింగిలో ఎన్నాళ్ళని వెలుగుతావూ?
అయినా మలిపొద్దున కలిసే ఉషోదయాలు నిన్నెన్నడు గుర్తించాయనీ!
మసకబారిన మనసులకు సాక్ష్యాలుగా
అలా ఎన్నెన్ని లిప్తలు గడిపోతాయో
నిశీధుల్లో నువ్వూ నేనూ అలా చుక్కల్ని లెక్కిస్తూ

కాలాన్ని మరిచిన ఊహల కవనాలతో
అలసటలేని ఎదురుచూపులు
విలపించటమూ గుర్తురాని సుశుప్తలో
వేసవి తెమ్మెరలాంటి విరహాలు

ఇంకా ఎన్నెన్ని తిమిరాలు నిన్నిలా కలిపేసుకోవాలనీ నిరీక్షణ అని లెక్కలడక్కు..
చెక్క అల్మారీ మీద టేపు రికార్డరు
మనసులోనే ఎందుకో విలపిస్తోంది
ఎంతకాలంగానో మరి..
'నీవు రావు నిదుర రాదు'..
దాని గొంతెపుడు మూగబోతోందో తెలీదు
ఈ నిరీక్షణ ఇప్పట్లో ముగుస్తుందని నమ్మకంగానూ లేదు

సరిత భూపతి
20/1/17

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి