23, ఏప్రిల్ 2017, ఆదివారం

// కీకారణ్యం //

ఒకచోట సగం విరిగిన కుర్చీ
వసారాలో పడి ఏడుస్తూ ఉంటుంది
వచ్చీ పోయే మనుషులు దానికి సంతాపం చెప్తున్నారో
వాళ్ళకది నిశ్చలం నేర్పుతుందో మరి
అదే మూలన ఆర్తనాదంతో చెక్కబల్ల మూలుగులు
దానిపై ఎప్పటికీ ఎవ్వరికీ వినాలన్పించని
ఎండిన ఎముకల రొదతో మనిషి వాసన
కొన్నంతే..అసలేమీ చెప్పుకోనవసరం లేకుండానే
అసలేం చెప్పబుద్ధేయకుండానే
చాలా మామూలుగానే ఉంటాయి

మరో చోట ఎవడో పార్న్ స్టార్ ఊరువుల మీద
పడి ఏడుస్తున్న వాడి మీద పడి ఏడుస్తాడు
వాడూ వీడూ పడీ పడీ రాసుకున్నా కనీసం బూడిదైనా రాలదే
సోకాల్డ్ దేశభక్తి వీరులు అమ్మా.. ఇంత బూడిదైనా మిగిలిందని వీరతిలకం చెరిపి భరతమాత నుదుట పుయ్యటానికి

ఆదిపరాశక్తి అని పిలిచి ఆమ్లెట్ లా మింగేసే
ఆవారాగాడొకడు మెుగుడు చచ్చిన దాని నుదుటన పిట్యూటరీ గ్లాండ్లు పనిచేయక్కర్లేదని తలరాతను లిఖిస్తాడు
ఆమెకు ఎవరో ఆడతనం ఆపాదిస్తే అరువిచ్చిన నుదుటుని మళ్ళీ ఎవరికోసమో వదిలేసి పోతుంది
రక్తపు తిలకాలు కళ్ళల్లో సుడులు తిప్పుతూ
పగిలిన గాజుముక్కల్ని మదపుబుద్ధిపై గునపాల్లా గుచ్చి నడిచి ఉంటే ఆమె ఎప్పటికీ పార్వతీ దేవే

ఎవరి గొంతుకలో నులిమేసిన చప్పుళ్ళు విన్నట్టు
ఆకాశం ఎప్పటిలానే రోదిస్తూ ఉంటుంది
ఎవరెవరి దుఃఖమో మోయలేక భారమైపోయిన
ఆకులు రాలిపోతూ ఉంటాయి
గుండెలవిసిపోయే ఆందోళనలోనూ సముద్రం అలలు
హిందోళంలో పాడుకుంటూ ఉంటాయి ఎప్పటిలానే
యేటా ఎవడో జెండా ఎగరేసి
మిగిలిన రోజుల్లో కాళ్ళు తుడుచుకుంటూ ఉంటాడు
గానుగెద్దులు దున్నిన భరతభూమి
గొడ్రాలై  రోదిస్తూ ఉంటుంది
ఎవడ్రా అది..ఇంకా పాతచింతకాయ పచ్చళ్ళు నాకేది?
ఇక దేశమంటే మనుషులెప్పటికీ కాదు
కనీసం మట్టైనా కాదు

-సరిత భూపతి
23/4/17

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి