29, మే 2017, సోమవారం

paroxysm

// paroxysm //

అలిగి వెళుతోవున్న మేఘం
అంచున పరిగెడుతూ ఎవరో బతిమాలుతూ ఉన్నారు
కాసేపటికి లోకం కళ్ళు మూసుకుంది
గుడ్డిదీపం ఒకటే నవ్విన చప్పుడు
మేఘం కల చెదిరిందేమో
కనీసం దానికి చెప్పుండాల్సింది
చీకటి పరుగులు మోస్తో
మరెవరూ వెనకాలే ఉండబోరనీ

తూర్పు అంచున రోజుకో ప్రసవం
నెత్తుటి కిరణాల పారాక్సిజమ్తో
ఉరిపోసుకున్న చీకటి , రెక్కలు కొట్టుకుంటూ
విలవిల్లాడి ఇక పోయింది

ఆపలేని ఒత్తిడిలో బండరాళ్ళను పగలగొట్టాలన్న ఆవేశంతో ఒక అల
కుంచెల ఊపిర్లు అలుముకున్న రంగు చుక్కలూ
చిత్రం కార్చిన ఆనందభాష్పాలే కదూ!

ఏడుస్తావే..
అది మరి నవ్వో, ఏడుపో
మనసు అణచలేని అవ్యక్తభావమెుకటి ఉన్నట్టుండి
కళ్ళల్లో జారిందేమో
ఏ చీకటికీ అందని మేఘమెుకసారి
చెంపల మీద నుంచి జారుతూ మెరిసింది

-సరిత భూపతి
29/5/17

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి