26, ఫిబ్రవరి 2017, ఆదివారం

వెన్నీల అలక

// వెన్నీల అలక //

ప్రతీరాత్రిలాగే కొన్ని కబుర్లలా చెక్కి ఉంచాను
వెన్నెల అలిగింది వినటానికి రాలేదు
నీ నవ్వులు కొంచెం దాని బుగ్గన పూసేస్తాను
ఇక మరెప్పుడూ చిన్నబోనంతగా అదీ నవ్వేస్తుంది

నిన్ను వినిపించినపుడల్లా చీకటి దారుల్లో నడుస్తూ
నీకోసం వెతుక్కుంటూ ఉంటుంది
నీకో వెలుతురు గీతం చూపించాలనే నా కబురు
నీ వరకూ మోసుకొచ్చి గుప్పెడు కలువల్ని
నీ కన్నుల వాకిళ్ళలో పేర్చి
ఇక ఎక్కడికో పోతుంది నా నిద్రలో కలైపోతుంది
మళ్ళీ ఎపుడొస్తావని నేను అడగను
అడగకపోయినా ఆత్రంగా వొచ్చేస్తుంది
నిన్ను చూడ్డం దానికంతిష్టం,  అంతే అసూయ మరి

నువ్వు నవ్వటం వెన్నెలకన్నా హాయిగా ఉంటుందన్నపుడు
దానిక్కానీ వినపడిందేమో
మచ్చలేని చంద్రుని నవ్వు హయే మరి
అని అలిగి వెళ్ళిపోయింది
ఈ వేళ రానేలేదు

-సరిత భూపతి
26/2/17

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి