9, ఫిబ్రవరి 2017, గురువారం

మరీచిక

// మరీచిక //

ప్యారా!
ఎన్ని పదాలు అల్లినా అది నువ్వవలేనపుడు అసలింకెలా చెప్పగలను?
కానీ నీకిపుడు చెప్పాలి
కాస్త నిశ్శబ్ధాన్ని కూడా వినగలిగినపుడు
ఏమీ చెప్పలేనితనాన్ని కూడా కొన్నిసార్లు చదవాలి
దిగులుగా శూన్యంలో నడుచుకుంటూ ఉంటాను
కీచురాళ్ళు భయపడుతున్న మూలుగు
చీకట్లు ఉళిక్కిపడేంత నలుపు
వణికిపోతున్న గుండెపుడో స్పందించటం మానేసింది
దారే తెలియని దారిలో దారి తప్పిపోయాను
ఎక్కడ్నుంచి వచ్చిందో కళ్ళు పొడుచుకెళ్ళేంత ప్రకాశవంతంగా ఒక కాంతిపుంజం
నా వెనకాలే వెతికి పట్టుకున్నట్టుగా ఓ మరీచిక
ఆశ్చర్యకరంగా అది నువ్వే..
బతకటం ఎలా బావుంటుందో
నువ్వే చెప్పాలి..నువ్వు మాత్రమే
పగిలిపోయిన నీటిచారలు
ముభావంగా ఆకాశంకేసి చూస్తున్నపుడు
పెట్రికోర్ సువాసనల్లా సాంత్వననిస్తూ నీ మాటలు
నువ్వొచ్చావని చెప్పనా...వానొచ్చిందనా?
అలా స్వాతివానలో కాసేపు ఒలికిపోతాను
నువ్వుండటం ఎంత బావుంటుందో తెలుసా
కాదు..అసలు నువ్వున్నావనే ఊహే ఎంత బావుంటుందో తెలుసా!
అమ్మ లాలిపాట ఇంకా వింటున్నాననే భ్రమలోనే
ఆదమరిచి నిదిరిస్తున్న పాపాయి మోములా

-సరిత భూపతి
9/2/17


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి